తెలంగాణ రాష్ట్రంలోని చేనేత ఉత్పత్తులు ప్రపంచంలోని దేశ విదేశాలకు ఎగుమతి అవుతున్న సంగతి విదితమే. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత రంగం అభివృద్ధికై.. నేతన్నల సంక్షేమంకోసం పలు పథకాలను చేపడుతున్న విషయం మనకు తెల్సిందే.
ఈ క్రమంలో రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లాకు చెందిన నేతన్నలు వేసిన చీరను న్యూజిలాండ్ దేశానికి చెందిన మహిళా ఎంపీ ప్రియాంక రాధాకృష్ణన్ ధరించారు. న్యూజిలాండ్ లో జరుగుతున్న బతుకమ్మ వేడుకల్లో భాగంగా బ్రాండ్ తెలంగాణ ద్వారా సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ తయారు చేసిన చీరను న్యూజిలాండ్ లో దక్షిణ భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రియాంక చీరె కట్టుకుని సందడి చేశారు.
అంతేకాకుండా న్యూజిలాండ్ లో బ్రాండ్ తెలంగాణకు ప్రచారకర్తగా వ్యవహరించడానికి ఆమె ముందుకొచ్చారు. ఈ క్రమంలో ఎంపీ ప్రియాంక మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం అభినందనీయమని “అన్నారు.