తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ముద్ర పథకంలో అన్యాయం చేస్తుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. ముద్ర పథకం కింద రాష్ట్రంలో మొత్తం ఇప్పటివరకు 28,86,210 మందికి మాత్రమే రుణాలు అందాయని ఆయన అన్నారు.
ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర జనాభాతో పోలిస్తే ఇది కేవలం 7.42 శాతమే అని ఆయన విమర్శించారు. దీనికి సంబంధించిన వినోద్ కుమార్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఆదివారం స్వయంగా లేఖ రాశారు. ఈ లేఖలో దేశంలో తమిళనాడులో 33.14%, కర్ణాటకలో 31.05%, త్రిపురలో 31.02%, పశ్చిమ బెంగాల్ లో 20.23% మందికి ముద్ర రుణాలు అందాయి.
తెలంగాణకు మాత్రం అన్యాయం చేశారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి ఈ సమస్యను పరిష్కరించాలని ఆర్హులైన చిరు వ్యాపారులు,నిరుద్యోగ యువతకు రుణాలను అందించాలని ఆయన కోరారు.