ఏపీ మాజీమంత్రి, ఆళ్లగడ్డ మాజీ టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ భర్త భార్గవరామ్ కేసుల భయంతో విదేశాలకు పారిపోయినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే ఇటీవల ఆళ్లగడ్డలో భార్గవ రామ్‌పై హత్యా ప్రయత్నం కేసు నమోదు అయింది. కర్నూలు జిల్లా దొర్నిపాడు మండలం కొండాపురానికి చెందిన శివరామిరెడ్డి, అఖిలప్రియలు క్రషర్ ఫ్యాక్టరీలో భాగస్వాములు. అయితే కొద్ది కాలానికి వ్యాపార లావాదేవీల్లో వివాదం తలెత్తింది. ఈ క్రమంలో అఖిలప్రియ భర్త భార్గవరామ్ తన భర్తపై హత్యాయత్నం చేశారంటూ…శివరామిరెడ్డి భార్య మాధవీలత భార్గవరామ్‌పై ఆళ్లగడ్డ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు నిమిత్తం హైదరాబాద్‌లో భార్గవరామ్‌ను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నించారు. అయితే తన కారును ఆపినట్లే ఆపి, వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఈ క్రమంలో పోలీసుల వాహనాన్ని ఢీకొట్టేందుకు భార్గవరామ్ ప్రయత్నించాడని ఆళ్లగడ్డ ఎస్సై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్లు 353, 336 కింద కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు భార్గవరామ్‌ను పట్టుకునేందుకు ప్రయత్నాలు ఆరంభించారు. అటు ఆళ్లగడ్డ పోలీసులు, ఇటు హైదరాబాద్ పోలీసులు తన కోసం వెదుకుతుండడంతో భయపడిన భార్గవరామ్ విదేశాలకు పారిపోయాడని తెలుస్తోంది. కాగా అతని స్నేహితులు మాత్రం భార్గవరామ్ గ్రీస్‌లో ఉన్నాడని చెబుతున్నారు. కాగా ఇటీవలి ఎన్నికల్లో ఆళ్లగడ్డలో ఓటమి పాలై, వ్యక్తిగత ప్రవర్తనతో అందరిని దూరం చేసుకుని, రాజకీయంగా ఇబ్బందిపడుతున్న అఖిల ప్రియకు.. ఇలా భర్త కేసుల్లో ఇరుక్కుపోయి పరారీలో ఉండడం మరింత తలనొప్పిగా మారింది. అయితే అఖిల ప్రియ భర్త నిజంగానే విదేశాలకు పారిపోయాడా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తంగా అఖిలప్రియ భర్త విదేశాల్లోకి పారిపోయాడన్న వార్తలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
