గత ఐదేళ్ల టీడీపీ హయాంలో పల్నాడులో యదేఛ్చగా సున్నపురాయి మైనింగ్‌కు పాల్పడి వందల కోట్లు దోచుకున్న గురజాల మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావుపై నమోదైన కేసు ఇక సీబీఐ చేతుల్లోకి వెళ్లిపోయింది. నెల రోజుల క్రితం అక్రమ మైనింగ్ కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పగించవచ్చని ఏపీ హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వారం రోజుల్లో సీబీఐ ఈ కేసును పూర్తిగా టేకప్ చేయనుంది. ఇప్పటికే ఈ కేసును దర్యాప్తు చేసిన ఏపీ సీబీసీఐడీ అధికారులు అన్ని ఆధారాలను సీబీఐకి అప్పగించనున్నారు. వాస్తవానికి చంద్రబాబు హయాంలోనే పల్నాడులో మైనింగ్ మాఫియాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మైనింగ్ మాఫియాపై నాటి ప్రతిపక్ష వైసీపీ కూడా పోరాటం చేసింది. అయితే లోకేష్, బాబుల అండదండలతో యరపతినేని, ఆయన అనుచరులు మైనింగ్ మాఫియాను ప్రశ్నించినవారిపై భౌతికదాడులకు కూడా తెగబడ్డారు. యరపతినేనిపై సర్వత్రా విమర్శలు రావడంతో అప్పుడు బాబుగారి ప్రభుత్వం మైనింగ్ మాఫియాపై సీబీసీఐడీ విచారణకు ఆదేశించింది. కానీ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో విచారణ ముందుకుసాగలేదు.
ఇటీవల వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైకోర్టు ఆదేశంతో విచారణ వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో అక్రమ మైనింగ్‌పై 17 కేసులు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ట్రాక్టర్ డ్రైవర్లు, కూలీలు, మిల్లర్లు, ఇతర వ్యక్తులను సీఐడీ అధికారులు విచారించారు. సుమారు 700 మందిని విచారించి వారి నుంచి స్టేట్‌మెంట్లు నమోదు చేశారు. ఆయా కేసుల్లో కీలకమైన సాక్షులను న్యాయమూర్తి ఎదుట హాజరు పరచి సెక్షన్ 164 ప్రకారం మొత్తం 24 మంది నుంచి స్టేట్‌మెంట్‌లు తీసుకున్నారు. ఈ క్రమంలో కేసును సీబీఐకి అప్పగించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో హైకోర్టు పరిధిలో ఉన్న కేసులను సీఐడీ అధికారులు ఉపసంహరించుకున్నారు. నెల రోజుల క్రితం సీబీఐకి కేసు అప్పగించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అనంతరం సీఐడీ అధికారులు అయా కేసుల వారీగా వారు జరిపిన దర్యాప్తు పత్రాలను సిద్ధం చేశారు. ఎప్పుడు సీబీఐ అధికారులు వచ్చినా అన్ని పత్రాలను అందచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వారం రోజుల్లో సీబీఐ అధికారులు వచ్చి కేసుకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది.
పల్నాడు అక్రమ మైనింగ్ కేసును సీబీఐ విచారణ చేపడుతుండడంతో యరపతినేనితో పాటు అక్రమ మైనింగ్‌లో భాగస్వాములైన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. చంద్రబాబు, లోకేష్‌ల అండతో బినామీల పేరుతో అక్రమ మైనింగ్‌కు పాల్పడి దోచుకున్న వందల కోట్లను సీబీఐ అధికారులు తిరిగి కక్కిస్తారని వారు భయపడుతున్నారు. సీబీఐ అధికారులు ఎప్పుడు ఎవరిని విచారణకు పిలుస్తారోనని వణికిపోతున్నారు. తమ అక్రమాస్థులన్నీ ఈడీ ఎక్కడ జఫ్తు చేస్తుందో అంటూ హడలిపోతున్నారు. అయితే గత ఐదేళ్లలో పల్నాడులో జరిగిన అక్రమ మైనింగ్‌లో చంద్రబాబు, లోకేష్‌లకు కూడా భారీగా వాటాలు ముట్టాయని యరపతినేని అనుచరులు అంటున్నారు. ఇప్పుడు సీబీఐ విచారణ చేపడితే అక్రమమైనింగ్‌లో యరపతినేనితో సహా ఎవరెవరికి వాటాలు అందాయా..వాటి వివరాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. పల్నాడు అక్రమ మైనింగ్ కేసు సీబీఐ చేతిలోకి వెళ్లిపోవడంతో బాబు బ్యాచ్‌లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని 50 కు పైగా కేసుల్లో ఇరుక్కుని జైల్లో ఉండగా, యరపతినేని జైలుకు పోవడం ఖాయంగా కనిపిస్తోంది.. ఆ వెంటనే కూనరవికుమార్, సోమిరెడ్డి, కోడెల శివరామ్‌లాంటి నేతలు జైలుకు వెళ్లేందుకు క్యూలో ఉన్నారని తెలుగుతమ్ముళ్లు అంటున్నారు. మొత్తంగా అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ విచారణతో యరపతినేని జైలుకు పోవడం ఖాయమని, చంద్రబాబు, లోకేష్‌లు కూడా చిక్కుల్లో పడే అవకాశం ఉందని ఏపీ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.