అనంతపురం జిల్లాలో శనివారం ఇంకుడుగుంతలో పడి ముగ్గురు, చెక్‌డ్యాంలో మునిగి ఒకరు మృతి చెందారు. రాప్తాడు మండలం చెర్లోపల్లి పంచాయతీ పరిధిలోని పాలబావి గ్రామంలో ఇంకుడుగుంతలో పడి మమత (20), చేతన్‌వర్మ(14), వర్షిత్(7) మృతి చెందారు. పాలబావి గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ, పార్వతీ దంపతులకు మమత, పృథ్వీరాజ్ ఇద్దరు సంతానం. లక్ష్మీనారాయణ గ్రామంలో పండ్ల తోటలు సాగు చేస్తూ జీవనం సాగించేవారు. అలాగే శ్రీరాములు హైదరాబాద్‌లో పోలీస్ కానిస్టేబుల్ కాగా భార్య యశోదమ్మ, కుమారుడు చేతనవర్మతో కలిసి అక్కడే నివాసం ఉండేవాడు. ఇక వృత్తిరీత్యా డ్రైవర్ అయిన రామచంద్ర కూడా భార్య భాగ్యలక్ష్మి, కొడుకు వర్షిత్‌తో కలిసి హైదరాబద్‌లో కాపురం ఉంటున్నాడు. వారు దసరా పండుగకు సొంత గ్రామమైన పాలబావి గ్రామానికి వచ్చారు. అయితే మమత శనివారం చేతన్‌వర్మ, వర్షిత్‌తో కలిసి గ్రామ సమీపంలో వున్న వారి సీతాఫలం తోటలోకి వెళ్లారు. పొలం పక్కనే ఇంకుడు గుంతలు ఉండడంతో అటువైపు వెళ్తుండగా వర్షిత్ కాలు జారి పడిపోగా చేతన్‌వర్మ, మమత కాపాడేందుకు నీటిలోకి దిగారు. కానీ ఇంకుడుగుంత లోతు ఎక్కువగా వుండడంతో ముగ్గురూ నీటిలో మునిగి అక్కడికక్కడే మృతి చెందారు. దసరా సెలవుల్లో సరదాగా గడుపుదామని సొంత ఊరికి రాగా ఇలా పిల్లలు దూరమవడంతో ఆయా కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అలాగే కళ్యాణదుర్గం మండల పరిధిలోని భట్టువానిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీదేవి, తిమ్మప్ప దంపతుల కుమారుడైన తిరుమలేష్(10) గ్రామ సమీపంలో ఉన్న చెక్‌డ్యాం వద్దకు వెళ్లి స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడు.
