ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు విశాఖలో జరిగిన సమావేశంలో సీఎం జగన్‌పై, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పాలన పిచ్చోడి చేయితో రాయి అని బాబు తీవ్ర వాఖ్యలు చేశాడు. అంతే కాదు జగన్‌కు నా రాజకీయ జీవితమంత వయసు, అనుభవం లేదు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నన్ను చూసి భయపడేవారు..కాని జగన్ మాత్రం నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని దుయ్యబట్టాడు. తమ పార్టీ మీటింగ్‌లకు తమ కార్యకర్తలను రానివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని…అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యాడు.. చంద్రబాబు విమర్శలకు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా చంద్రబాబుపై అనకాకపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు..మీరేమైనా అందగాడా..శోభనబాబు అనుకుంటున్నారా..అసలు మిమ్మల్ని కలవడానికి ఎవరైనా ఇష్టపడతారా అంటూ అమర్‌నాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు. తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన గురించి పిచ్చోడి చేతిలో రాయి అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దారుణమన్నారు. అసలు పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఎలా ఉంటుందో గత ఐదేళ్లలో బాబు పాలనలో జనాలు స్వయంగా అనుభవించారని, అందుకే కేవలం 23 సీట్లే ఇచ్చి పక్కన కూర్చోపెట్టారని అమర్‌నాథ రెడ్డి అన్నారు.
ఇక తనను చూసి వైయస్‌ఆర్ భయపడేవాడు అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ.. గొప్పల కోసం బాబు మరీ ఇంత దిగజారిపోయి మాట్లాడుతారనుకోలేదని అన్నారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన తర్వాత చంద్రబాబు సొంతంగా అధికారంలోకి వచ్చిన సందర్భం ఒక్కటైనా ఉందా అని అమర్‌నాథ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబుకు మతి పోయిందో.. లేదా మత్తెక్కి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. మామూలుగా చంద్రబాబుకు మందు అలవాటు లేదు.. కానీ ఓడిపోయిన తర్వాత ఏమైనా మారిపోయారా అంటూ అమర్‌నాథ్ అనుమానం వ్యక్తం చేశారు. తన కుమారుడు లోకేష్ భవిష్యత్తు ముగిసిపోయిందనే బాధతోనే చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అమర్‌నాథ్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలనలో ఓటుకు నోటు, కాల్‌మని, ఇసుక మాఫియా లాంటివి ఎన్నో చూశామని చెప్పారు. విశాఖ గురించి కలలు కన్నానని చంద్రబాబు కపట ప్రేమ చూపిస్తున్నారని మండి పడ్డారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను చంద్రబాబే దెబ్బ తీశారని ఆరోపించారు. విశాఖ ల్యాండ్ స్కామ్‌లో అప్పటి టీడీపీ మంత్రి, లోకేష్‌ల హస్తం ఉందని..సాక్షాత్తు విశాఖకు చెందిన మీ పార్టీకి చెందిన అయ్యన్నపాత్రుడు విమర్శించిన సంగతి గుర్తులేదా చంద్రబాబు అని అమర్‌నాథ్ రెడ్డి ప్రశ్నించారు. విశాఖలో బీచ్ లవ్ ఫెస్టివల్ అంటూ బ్రాండ్ ఇమేజ్‌ని దెబ్బతీయాలని చూసింది నువ్వు కాదా చంద్రబాబు అని వైసీపీ ఎమ్మెల్యే అన్నారు. అప్పట్లో వైఎస్ హయాంలో మాత్రమే విశాఖ అభివృద్ధి జరిగింది.. మళ్లీ ఇప్పుడు సీఎం జగన్ హయాంలో అభివృద్ధి జరగబోతుందని అమర్‌నాథ్ స్పష్టం చేశారు. తెలుగుదేశం నేతలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. చంద్రబాబులా పెయిడ్ ఆర్టిస్ట్‌లతో పబ్లిసిటీ చేయించుకున్న నేతలేవరిని చూడలేదని అమర్‌నాథ్ విమర్శించారు. ప్రజలు నవ్వుకునేలా మాట్లాడవద్దంటూ చంద్రబాబుకు సూచించారు. మొత్తంగా విశాఖలో సీఎం జగన్‌పై, వైసీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని నోటికివచ్చినట్లు విమర్శలు చేసిన చంద్రబాబుకు వైసీపీ నేతలు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు. గత ఐదేళ్ల బాబు పాలనలో విశాఖలో జరిగిన అవినీతి, అరాచకాలను ఎండగడుతూ..అదిరిపోయే సెటైర్లు వేస్తున్నారు.