విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు హిందూ ధర్మ ప్రచారయాత్ర నిమిత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. యాత్రలో భాగంగా అక్టోబర్ 11 శుక్రవారం రాత్రి ధర్మపురి లక్ష్మీ నరసింహ క్షేత్రాన్ని స్వామివారు దర్శించుకున్నారు. ముందుగా గోదావరి నదిలో పుణ్యస్నానం ఆచరించి, నదీమతల్లికి హారతినిచ్చారు. తదనంతరం ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహుడిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశా రు. స్వామివారి ఆగమనం సందర్భంగా ఆలయ ఛైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, ఈవో శ్రీనివాస్, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం స్వామివారికి ఈవో శ్రీనివాస్ నృసింహుడి శేషవస్త్రాన్ని, చిత్రపటాన్ని, ప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా శ్రీ స్వాత్మానందేంద్ర మాట్లాడుతూ..సంస్కృతీ, సంప్రదాయాలకు నిలయమైన ధర్మపురిలో లక్ష్మీ నృసింహుడు కొలువై ఉండడం ఎంతో గొప్ప పుణ్యఫలమన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మ ప్రచారయాత్ర తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త, దరువు ఎండీ సీహెచ్ కరణ్ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమన్వయకర్త గడిచర్ల శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.