ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనంతపురంలో వైఎస్‌ఆర్ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించారు.. వైద్య, ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. రాష్ట్ర జనాభాలో 2.12 కోట్ల మందికి కంటి సమస్యలు ఉన్నాయన్నారు.ఆరుదశల్లో వైఎస్‌ఆర్ కంటి వెలుగు పథకం అమలు చేస్తానని, మొదటి రెండు దశల్లో 70.41 లక్షలమంది విద్యార్ధులకు పరీక్షలు, చికిత్సలు చేయిస్తామన్నారు.. ఈ సందర్భంగా పలువురు అంధ విద్యార్థులు మాట్లాడిన మాటలతో జగన్ సహా అందరూ నివ్వెరపోయారు.
ముందుగా నా పేరు ఎం.వరుణ్ కుమార్, పదోతరగతి చదువుతున్నాను. నేను పుట్టగానే కంటి చూపు కోల్పోయాను. ఈవిషయం వైద్యులు మా తల్లి దండ్రులకు చెప్పగానే వారు ఎంతో బాధపడ్డారు. నేను మామూలు పిల్లల్లాగా ఆడుకోలేను.. వారిలాగా చదువుకోలేను.. వారిలా రంగురంగుల ప్రపంచాన్ని చూసి ఆనందించ లేను. నాకు దొరకని అవకాశం అందరికీ దొరికినందుకు ఎంతో ఆనంద పడుతున్నాను. కంటిచూపు విలువ ఏంటో నాకు తెలుసు. కాబట్టి మీరందరూ ఈ పథకాన్ని బాగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. దివ్యాంగుల పట్ల ప్రత్యేక దృష్టి సారించి, ఎలిమెంటరీ స్థాయి నుంచే వారిపై దృష్టి సారించాలని కోరుకుంటున్నాను. అలాగే వారికి ప్రత్యేకంగా టీచర్లను ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నానన్నారు.
తర్వాత ఎన్. అనుష, కల్లూరు జెడ్పీహెచ్‌ఎస్ స్కూల్ లో పదోతరగతి చదువుతున్నాను. నాతోటి ఎంతోమంది విద్యార్ధులు కంటిచూపు లేక బాధపడుతున్నారు. అటువంటి సమయంలో మన సిఎంగారు ఈపథకాన్ని తేవడం ఎంతో ఆనందంగా వుంది. అన్నామీరు ఇటువంటి మంచి కార్యక్రమాలు మూడునెలల్లో ఎన్నో చేసినందుకు మాకు ఆనందంగా వుంది. మీరు వచ్చిన ఈ మూడు నెలల్లోనే చేస్తున్న ఇటువంటి కార్యక్రమాలను పక్కరాష్ట్రాల వారు కూడా పొగుడుతూ వున్నందుకు మాకు ఎంతో ఆనందంగా వుంది. ఎంతో గర్విస్తున్నాను. అన్నా… దీనితో పాటు ఓ చిన్న విన్నపం. ఆడపిల్లలకు శానిటరీ నాప్ కిన్ సరఫరా చేయాలని కోరుతున్నాను. అటువంటి సమయంలో బడికి రావడానికి ఆడపిల్లలకు చాలా ఇబ్బంది అవుతోందని చెప్పటంతో జగన్ సరేనన్నారు.
నా పేరు ఇ.అనంత్, ఎపి రెసిడెన్షియల్ స్కూల్ ఆఫ్ ఎక్స్ లెన్స్ లో పదోతరగతి చదువుతున్నాను. అన్నా.. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ వాడుతున్నారు. ఫోటోలు తీయడానికి సెల్ ఫోన్ వెనుక వున్న కెమేరాకు విలువ ఇస్తున్నారే తప్ప…దానికన్న వందరెట్లు విలువైన మన కంటికి మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఇటువంటి సమయంలో మీరు మహత్కరమైన పథకాన్ని చేపట్టినందుకు నాకు ఎంతో సంతోషంగా వుంది. అలాగే మనరాష్ట్రంలో కంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఈ పథకాన్ని తెచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఈపథకం మన రాష్ట్రంలోని ఎంతోమంది ఇళ్లలో వెలుగులు నింపుతుంది.