హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్న విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు అక్టోబర్ 10, గురువారం నాడు కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. కొండగట్టుకు విచ్చేసిన స్వామివారికి ఆలయ ఫౌండర్, ట్రస్టీ మారుతి,ఈవో కృష్ణ ప్రసాద్, ప్రధాన అర్చకులు పూలమాలలు సమర్పించి, పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఆలయంలోని ఆంజనేయస్వామికి స్వామివారు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులకు, అర్చకులకు, భక్తులకు స్వామివారు విశాఖ శ్రీ శారదాపీఠం తరపున కానుకలను బహుకరించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారు మాట్లాడుతూ.. విశాఖ శ్రీ శారదపీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారతదేశ యాత్ర చేపట్టాలన్న మా గురువర్యులు శ్రీ స్వరూపానందేంద్ర స్వామి ఆదేశాల మేరకు తెలంగాణ నుంచి ధర్మ ప్రచారయాత్రను ప్రారంభించినట్లు తెలిపారు. తొలుత వరంగల్‌లో 9 రోజుల పర్యటన ముగించుకుని, వేములవాడ రాజన్న ఆలయం నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ధర్మ ప్రచార యాత్రకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలో అక్టోబర్ 10న కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకోవడం జరిగిందని స్వామివారు అన్నారు. శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో విలసిల్లాలని ప్రార్థించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులతోపాటు స్వామివారి హిందూ ధర్మ ప్రచారయాత్ర సమన్వయకర్త, దరువు ఎండీ సీహెచ్ కరణ్ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమన్వయకర్త గడిచర్ల శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.