విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన హిందూ ధర్మ ప్రచారయాత్ర 1000 కి.మీ. పూర్తి చేసుకుంది. తొలుత సెప్టెంబర్ 29 నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 9 రోజుల పాటు పర్యటించారు. ఈ తొమ్మిది రోజులు వరంగల్ నగరంలోని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో నిర్వహించబడిన దేవీ నవరాత్రుల ఉత్సవాలలో శ్రీ రాజశ్యామల అమ్మవారికి పీఠపూజలు చేస్తూ, మరోపక్క జిల్లాలోని వేయి స్తంభాల గుడి, భద్రకాళీ ఆలయం వంటి పలు చారిత్రక దేవాలయాలను, ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించారు. అంతే కాకుండా స్వయంగా భక్తుల ఇండ్లను సందర్శిస్తూ, అమ్మవారికి పాదపూజలు చేస్తూ, హిందూ ధర్మ ప్రచారం గావించారు. జిల్లాలో పట్టణాల దగ్గర నుంచి, పల్లెల వరకు స్వామివారికి భక్తులు నీరాజనం పలికారు. ఊరూరా ధర్మ ప్రచారయాత్రకు అపూర్వ స్పందన దక్కింది. అక్టోబర్ 8న వరంగల్ పర్యటన ముగించుకున్న స్వామివారు 9 వ తేదీన వేములవాడ రాజన్న ఆలయాన్ని దర్శించుకుని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తన హిందూ ధర్మ ప్రచారయాత్రకు శ్రీకారం చుట్టారు. కరీంనగర్‌లో ఎల్.రాజభాస్కర్ రెడ్డి నివాసంలో రాజశ్యామల దేవికి పీఠపూజలు నిర్వహిస్తూ, తదనంతరం భక్తుల ఇండ్లలో పాదపూజలతో పాటు , జిల్లాలోని పలు ప్రసిద్ధి చెందిన ఆలయాలను స్వామివారు దర్శిస్తున్నారు. ఈ క్రమంలో అక్టోబర్ 10 న కొత్తపల్లి సచ్చిదానంద ఆశ్రమాన్ని స్వామివారు సందర్శించి, గోపూజ చేసి అక్కడి రామాలయం, వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే మానకొండూరు గ్రామంలోని రామాలయాన్ని సందర్శించిన స్వామివారు ఆ గ్రామానికి, విశాఖ శ్రీ శారదాపీఠానికి ఉన్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు. తదనంతరం జిల్లాలో ప్రసిద్ధి చెందిన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని స్వాత్మానందేంద్ర దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లాలతో కలిపి శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి వారి హిందూ ధర్మ ప్రచారయాత్ర దిగ్విజయవంతంగా 1000 కి.మీ. పూర్తి చేసుకుంది. ఈ హిందూ ధర్మ ప్రచారయాత్ర కరీంనగర్‌లో నాలుగు రోజుల పాటు సాగుతుంది. తదనంతరం వరుసగా ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్, హైదరాబాద్ అదిలాబాద్ జిల్లాలలో స్వాత్మానంద పర్యటిస్తారు.కాగా తొలివిడత హిందూ ధర్మ ప్రచార యాత్ర ఉత్తరతెలంగాణలో అక్టోబర్ 25 న ముగుస్తుంది. తదనతరం స్వాత్మానందేంద్ర దక్షిణ తెలంగాణలో పర్యటిస్తారు. ధర్మ ప్రచారయాత్ర తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త, దరువు ఎండీ సీహెచ్ కరణ్‌రెడ్డి స్వామివారి కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మొత్తంగా విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారి ఆశీస్సులతో ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు చేపట్టిన హిందూ ధర్మ ప్రచారయాత్ర అడుగడుగునా భక్తులు నీరాజనాల మధ్య 1000 కి.మీ. పూర్తి చేసుకుని దిగ్విజయవంతంగా కొనసాగుతుంది.
\
1000 కి.మీ. పూర్తి చేసుకున్న విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి
1000 కి.మీ. పూర్తి చేసుకున్న విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారిహిందూ ధర్మ ప్రచారయాత్ర
Posted by Sri Saradapeetam on Friday, 11 October 2019