దసరా రోజు అటు టీడీపీ అధినేత చంద్రబాబుకు, ఇటు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు పవర్‌ఫుల్ పంచ్ తగలనుంది. టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన ఇద్దరు కీలక నేతలు ఇవాళ వైసీపీలో చేరుతున్నారు. వారిలో ఒకరు టీడీపీ సీనియర్ నేత జూపూడి ప్రభాకర్ కాగా, మరొకరు జనసేన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ. వీరిలో జూపూడి ప్రభాకర్ దసరా రోజున సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నారు. జూపూడి ప్రభాకర్ రావు వాస్తవానికి వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కీలక నేతగా ఉన్నారు. జగన్ తరపున వాయిస్‌ను బలంగా వినిపించారు. జగన్ కూడా జూపూడికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. అయితే 2014 ఎన్నికలలో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన జూపూడి తదనంతరం టీడీపీలో చేరారు. చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీ పదవిని రెన్యువల్ చేయకుండా నామినేటెడ్ పదవిని అప్పగించారు. ఎక్కువగా టీవీ ఛానళ్ల చర్చల్లో కనిపించే జూపూడి బాబు ఆదేశాల మేరకు జగన్‌పై రాజకీయపరంగా తీవ్ర విమర్శలు చేసేవారు. కాగా 2019 ఎన్నికలలో టీడీపీ ఘోర పరాజయం చెందడంతో గత నాలుగు నెలలుగా జూపూడి అడపాదడపా టీవీ చర్చల్లో తప్పా, పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడంలేదు. ప్రస్తుతం టీడీపీ నేతలంతా పార్టీని వీడి బీజేపీలో చేరుతుండడంతో జూపూడి కూడా ఓ దశలో బీజేపీలో చేరుదామనుకున్నారు కానీ…ఆయన సన్నిహితులు బీజేపీ కంటే..వైసీపీలో చేరడం బెటరని సూచించారు. ఈ మేరకు జూపూడి వైసీపీలో చేరేందుకు ఆ పార్టీ నేతలతో చర్చలు జరిపారు. తొలుత జూపూడి చేరికపై జగన్ అభ్యంతరం పెట్టినా…పార్టీ నేతల సూచనలతో ఒప్పుకున్నాడు. దీంతో జూపూడి ఆలస్యం చేయకుండా ఇవాళ సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు.
ఇక జనసేన పార్టీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ దసరా రోజున వైసీపీలో చేరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. 2014లో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆకుల సత్యనారాయణ తూగో జిల్లాలో కీలక నేతగా ఎదిగారు. అయితే 2019 ఎన్నికలకు ముందు కాపు ఫ్యాక్టర్‌తో జనసేన పార్టీలో చేరిన ఆకుల సత్యనారాయణ… ఆ పార్టీ నుండి రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఓటమి తర్వాత చంద్రబాబుతో పవన్‌కు ఉన్న రహస్య బంధంపై, ముఖ్యంగా పవన్ వ్యవహారశైలిపై ఆకుల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన పలుమార్లు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏపీలో జగన్ పాలనపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను గమనించిన ఆకుల తన సతీమణితో కలిసి వైసీపీలో చేరేందుకు మొగ్గు చూపారు. సీఎం జగన్ కూడా ఆకుల చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు దసరా రోజున తన సతీమణి, వందలాది అనుచరులతో పాటు ఆకుల సత్యనారాయణ వైసీపీ కండువా కప్పుకోనున్నారు. త్వరలోనే ఉభయగోదావరి జిల్లాల నుంచి మరికొందరు కాపునేతలు ఆకుల బాటలో వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ నేతలు చెబతుతున్నారు. మొత్తంగా దసరా రోజున టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన ఇద్దరు కీలక నేతలు జగన్ సమక్షంలో వైసీపీలో చేరి చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారనే చెప్పాలి.