విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారుహిందూ ధర్మ ప్రచార యాత్ర నిమిత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. గత వారం రోజులుగా హన్మకొండలోని ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో స్వామివారు స్వయంగా శ్రీ రాజశ్యామలదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తదనంతరం జిల్లాలోని పలు చారిత్రక దేవాలయాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తూ స్వామి వారు హిందూ ధర్మ ప్రచారం గావిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ వరంగల్ నగరంలోని భద్రకాళీ దేవాలయాన్ని శ్రీ స్వాత్మానందేంద్ర సందర్శించారు. భద్రకాళీ ఆలయానికి విచ్చేసిన సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలోని గర్భగుడిలో భద్రకాళీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే మహర్ణవమిని పునస్కరించుకుని భద్రకాళీ ఆలయంలో నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో స్వామివారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ స్వాత్మానందేంద్ర మాట్లాడుతూ..శ్రీ విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి, గురువర్యులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారి సూచనల మేరకు ముందుగా హిందూ ధర్మ ప్రచారయాత్రను తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ప్రారంభించినందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఈ తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులలో అమ్మవారికి పూజలు చేస్తూ, అర్చనానంతరం జిల్లాలోని వేయి స్తంభాల గుడి వంటి చారిత్రక, ఆధ్యాత్మిక దేవాలయాలతో పాటు, వివిధ పల్లెలు, పట్టణాలలోని వివిధ దేవాలయాలను సందర్శించానని స్వామివారు తెలిపారు. ఇవాళ భద్రకాళీ ఆలయంలో అమ్మవారిని సందర్శించి, పూర్ణాహుతిలో పాల్గొనడం చాలా సంతోషాన్ని కలిగించిందని స్వామి అన్నారు. విశ్వంలో భూగోళం ఏ ఆధారం లేకుండా తన చుట్టూ తాను తిరుగుతుందంటే..దానికి కారణం అమ్మవారి యొక్క శక్తే కారణం అని స్వామివారు చెప్పారు. త్రిమూర్తులైన పరమశివుడైనా, నారాయణుడికైనా, బ్రహ్మకైనా స్వశక్తి అనేది లభించిందంటే..అది కేవలం అమ్మవారి అనుగ్రహమే అని , సమస్త జగత్తు అమ్మవారి శక్తితోనే నడుస్తుందని స్వామివారు స్థుతించారు. జగన్మాతఅయిన అమ్మ కరుణతోనే ఈ భూమి రక్షింపబడుతుందని..సమస్త జగత్తును పరిరక్షించే అమ్మవారిని..నిరంతరం దర్శనం చేసుకుంటే సకల శుభాలు కలుగతాయని ప్రవచించారు.భద్రకాళీ అమ్మవారి ఆలయానికి స్వామివారి ఆగమనం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి, ఆయన ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్‌విప్, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, హుస్నాబాద్ ఎమ్మెల్యూ వొడితెల సతీష్‌కుమార్, స్వామివారి ధర్మ ప్రచారయాత్ర రెండు తెలుగు రాష్ట్రాల కన్వీనర్, దరువు ఎండీ సీహెచ్ కరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.