Home / SLIDER / ఉద్యమంలా ప్రణాళిక పనులు

ఉద్యమంలా ప్రణాళిక పనులు

తెలంగాణ రాష్ట్రంలో 30రోజుల పల్లె ప్రణాళిక కార్యాచరణ లక్ష్యానికి చేరువవుతున్నది. పారిశుద్ధ్యం, అభివృద్ధే ధ్యేయంగా చేపట్టిన ప్రణాళిక సఫలికృతమై గ్రామీణ వాతావరణంలో మార్పుతెస్తున్నది. ప్రజాభాగస్వామ్యంతో చేపడుతున్న శ్రమదానాలతో పల్లె పరిశుభ్రంగా మారుతున్నది. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలతో పచ్చబడుతున్నది. పవర్‌వీక్‌లో భాగంగా ఏండ్లకిందటి కరంటు కష్టాలు తొలగిపోతున్నాయి. 25వ రోజైన సోమవారం శ్రమదానాలు కొనసాగగా, మంత్రులు, ఎమ్మెల్యేలు, జెడ్పీచైర్మన్లు, కలెక్టర్లు పాల్గొన్నారు.
 
రాష్ట్రవ్యాప్తంగా 30 రోజుల పల్లె ప్రణాళిక ముమ్మరంగా సాగుతున్నది. కుమ్రంభీంఆసిఫాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు పర్యటించారు. కౌటాల బస్టాండ్ ఆవరణలో మొక్కలు నాటిన అనంతరం శ్మశానవాటిక, డంపింగ్‌యార్డుల నిర్మాణానికి భూమిపూజ చేశారు. కర్జిల్లిలో జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. వనపర్తి జిల్లా మదనాపురం మండలం తిరుమలాయిపల్లి, అజ్జకొల్లు, మదనాపురం గ్రామాల్లో జరుగుతున్న పనులను కలెక్టర్ శ్వేతామొహంతి, డీపీవో రాజేశ్వరి పరిశీలించి, మిగిలిపోయిన పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
 
ఉద్యమంలా ప్రణాళిక పనులు
———————————————————-
 
జిల్లాల్లో ప్రగతి ప్రణాళిక పనులు ఉద్యమంలా జరుగుతున్నాయి. సోమవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, చొప్పదండి, గంగాధర, రామడుగు మండలాల్లోని గ్రామాల్లో శ్రమదానాలు చేపట్టారు. మొక్కలు నాటి ట్రీగార్డులు అమర్చారు. చిగుగరుమామిడి మండలంలో విద్యుత్ లైన్లు మరమ్మతులు చేశారు. మానకొండూర్ మండలం మద్దికుంటలో మొక్కలు నాటారు. శంకరపట్నం మండలంలోని మొలంగూర్‌లో ప్రాథమిక పాఠశాలకు రంగులు వేశారు. తాడికల్‌లో ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేశారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి, రామకృష్ణ కాలనీలో తాగు నీటి పైప్‌లైన్లు వేసుకున్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలకేంద్రంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మొక్కలు నాటారు. కలెక్టర్ ధరారెడ్డితో పాటు డీపీవో హనోక్ పల్లెప్రగతి పనులను పరిశీలించారు. సాలోజిపల్లిలో జరుగుతున్న పల్లెప్రగతి పనుల తీరుపై అధికారులు ప్రజాప్రతినిధులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
 
గ్రామాలకు కలెక్టర్లు
———————————————————-
 
ప్రగతి ప్రణాళిక అమలుతీరును పరిశీలించేందుకు కలెక్టర్లు గ్రామాలబాట పట్టారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం అందుగులపేటలో సోమవారం నిర్వహించిన గ్రామసభలో జెడ్పీ చైర్‌పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, కలెక్టర్ భారతి హోళికేరి, జేసీ సురేందర్‌రావు పాల్గొన్నారు. కాసిపేట మండలం దేవాపూర్, మద్దిమాడ గ్రామాలను జేసీ సురేందర్‌రావు పరిశీలించారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం ఛాగల్లు గ్రామాన్ని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి సందర్శించి ప్రగతి పనులు పర్యవేక్షించారు. జఫర్‌ఘడ్ మండల కేంద్రంలో పర్యటించిన కలెక్టర్ తడి, పొడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు. బచ్చన్నపేట మండలం వీఎస్‌ఆర్‌నగర్‌లో గ్రామస్థులకు తడిపొడి చెత్తబుట్టలను పంపిణీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని సాంబాయిగూడెం, పినపాక మండలంలోని పినపాక, తోగ్గూడెం, సీతారాంపురం గ్రామాల్లో, కరకగూడెం మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం కలెక్టర్ రజత్‌కుమార్ శైని పర్యటించి పనులను పర్యవేక్షించారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు, కొణిజర్ల మండలాల్లో వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పర్యటించి, ఏన్కూరులో డంపింగ్‌యార్డు పనులు ప్రారంభించారు. కామేపల్లి మండలంలో డీపీవో, అసిస్టెంట్ కలెక్టర్ హన్మంత్ కొడింబా మొక్కలు నాటారు. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం తీగుల్‌లో గ్రామస్థులు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. బెజ్జంకి ఎంపీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మొక్కలు నాటారు.
 
ముమ్మరంగా పల్లె ప్రణాళిక
———————————————————-
 
నారాయణపేట జిల్లాలో 30 రోజుల ప్రణాళిక కార్యాచరణ ముమ్మరంగా సాగుతున్నది. మద్దూరు మండలం ఖాజీపూర్ గ్రామంలో జెడ్పీ చైర్‌పర్సన్ వనజ, కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి మొక్కలు నాటి ట్రీగార్డులు ఏర్పాటుచేశారు. మక్తల్, మాగనూరు మండల అధికారులు, ప్రత్యేకాధికారులతో వేర్వేరుగా మండల పరిషత్ కార్యాలయాల్లో కలెక్టర్ వెంకట్రావు సమీక్షించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలకేంద్రంలో జేసీ రమేశ్ ఆకస్మికంగా పర్యటించారు. డీఆర్‌డీఏ పీడీ మందడి ఉపేందర్‌రెడ్డి ఆలేరు మండలం పటేల్‌గూడెం, గుండ్లగూడెం గ్రామాలు, డీపీవో వనం జగదీశ్వర్, యాదగిరిగుట్ట మండలంలోని సైదాపురం, జంగంపల్లి గ్రామాల్లో పర్యటించి శ్రమదానంలో పాల్గొన్నారు.
 
నిరంతర పర్యవేక్షణ
———————————————————-
 
30 రోజల ప్రణాళిక అమలుతీరుపై అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీరెడ్డి సోమవారం ఘట్‌కేసర్ మండలం ఎదులాబాద్‌లో పర్యటించారు. ఎస్సీకాలనీలో పారిశుద్ధ్య పనులు సరిగ్గా చేయకపోవడంతో అధికారులు, సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కీసర మండలం, అంకిరెడ్డిపల్లి గ్రామంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కౌటిల్య పర్యటించి పారిశుద్ధ్యంపై సిబ్బందికి సూచనలుచేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారంలో జరుగుతున్న పనులను ప్లయింగ్‌స్కాడ్ విజయ్‌కుమార్ సోమవారం తనిఖీచేసి పలు సూచనలు చేశారు.జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో కలెక్టర్ శశాంక గ్రామ కార్యచరణ కార్యక్రమంలో పాల్గొని గ్రామస్థులతో సమావేశాలు నిర్వహించారు. పరిసరాలను శుభ్రం చేసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. అయిజ మండలం తూంకుంట గ్రామంలో ఎంపీపీ తిరుమల్ రెడ్డి, ఎంపీడీవో గ్రామ కార్యాచరణ లో పాల్గొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని 441 గ్రామాల్లో 30 రోజుల ప్రణాళిక కార్యక్రమం విజయవంతంగా సాగుతున్నది. సోమవారం గ్రామాల్లో శ్రమదానంపై ప్రణాళికలు తయారు చేశారు.
 
ప్రణాళికతో మార్పు: మంత్రి కొప్పుల
———————————————————-
 
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రణాళిక కార్యాచరణతో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. సోమవారం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కమలాపూర్, వెల్గటూర్ మండలంలోని స్తంబంపల్లి గ్రామాలను సందర్శించి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతోపాటు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు. ప్రతీ గ్రామంలో ప్రత్యేకంగా స్థలం ఎంపిక చేసి పండ్ల మొక్కలను పెంచి మంకీ పుడ్‌కోర్టులను అభివృద్ధ్ది చేయాలన్నారు. అప్పుడే కోతుల బెడద ఉండదన్నారు. ధర్మపురి నియోజకవర్గంలోని 6 మండలాల నుంచి 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఆరు గ్రామాలను గుర్తించి, ఆ గ్రామాలకు ప్రత్యేకంగా గ్రామానికో రూ.5 లక్షలు ఇదివరకే ప్రకటించినట్టు గుర్తుచేశారు.
 
మన ఊరుకు రూ.3.50 కోట్ల విరాళాలు
 
– కలెక్టర్ హనుమంతరావు వెల్లడి
———————————————————-
 
30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామా ల అభివృద్దికి సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు పిలుపునిచ్చిన మన ఊరు (డోనర్స్-డే) కార్యక్రమానికి భారీస్పందన వచ్చింది. సెప్టెంబర్ 30 నాటికి జిల్లావ్యాప్తంగా రూ.3.50 కోట్ల విరాళాలు వచ్చా యి. తనవంతుగా కలెక్టరే స్వయంగా రూ. 25 వేల చెక్కును 26న జెడ్పీ సమావేశ మందిరంలో మంత్రి హరీశ్‌రావుకు అందజేశారు. జిల్లా అధికారులంతా కలిసి రూ.4.12 లక్షలు అందించారు. అదేవిధంగా ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి రూ.50 వేలు, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి రూ.90 వేలు, జెడ్పీ చైర్‌పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి రూ.20 వేలు, వైస్ చైర్మన్ కే ప్రభాకర్ రూ.16 వేలు, గ్రంథాలయ సంస్థచైర్మన్ నరహరిరెడ్డి రూ.25 వేలు విరాళంగా అందించారు. అదే విధంగా వ్యాపా ర, వాణిజ్య సంస్థలతోపాటు ప్రజలు భారీ గా విరాళాలు అందజేశారు.
 
గ్రామప్రగతికి రూ. 50 వేలు ఇచ్చిన కలెక్టర్ తల్లి
————————————————————————
 
గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గ్రామాభివృద్ధికి ములుగు కలెక్టర్ నారాయణరెడ్డి తల్లి చింతకుంట నర్సింగమ్మ రూ.50 వేల విరాళం అందించారు. నారాయణపేట జిల్లా నర్వ మండలం సీపురం గ్రామంలో నివాసం ఉంటున్న నర్సింగమ్మ రూ.50 వేలను సోమవారం గ్రామపంచాయతీ అధికారులకు అందించారు.
 
గ్రామాభివృద్ధికి చేయూత
———————————————————-
 
– రంగారెడ్డి జిలా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారం అభివృద్ధి కోసం దాత కొండ అశోక్ రూ. లక్ష విరాళాన్ని ఫ్లయింగ్ స్కాడ్ వినయ్‌కుమార్ చేతుల మీదుగా సర్పంచ్ లతశ్రీకి అందజేశారు.
 
– జనగామ జిల్లా నర్మెట మండలం ఆగాపేట గ్రామపంచాయతీ అభివృద్ధికి ఓ ఎన్‌ఆర్‌ఐ సహా ముగ్గురు దాతలు రూ.10వేల చొప్పున రూ.30 వేల నగదు అందజేయడంతో పాటు మరో ముగ్గురు దాతలు మూడుషెట్టర్ల నిర్మాణానికి అయ్యే ఖర్చు భరించేందుకు ముందుకు వచ్చారు.
 
– రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చీర్లవంచలో టీఆర్‌ఎస్ నేత బియ్యాల కొండల్‌రావు 100 మొక్కలకు ట్రీగార్డులను అమర్చారు. ఈ సందర్భంగా కొండల్‌రావును గ్రామస్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు అభినందించారు.
 
దుకాణాదారులకు జరిమానాలు
———————————————————-
 
గ్రామాలాభివృద్ధికోసం ప్రభు త్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 30 రోజల ప్రణాళిక అమల్లో పంచాయతీలు కఠినంగా వ్యవహరించాలంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశించడంతో రాయపర్తి పంచాయతీ పాలకవర్గం స్పందించింది. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తిలో ఇటీవల పర్యటించిన మంత్రి ప్రధానరహదారికి ఇరువైపులా అపరిశుభ్ర వాతావరణం చూసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దుకాణాదారులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు సోమవారం సర్పంచ్ గారె నర్సయ్య, పంచాయతీ కార్యదర్శి సృజన, ఎంపీటీసీ రాంచందర్ స్థానిక పెట్రోల్‌బంక్ యాజమానికి రూ.30 వేలు, వందన టీ స్టాల్ యజమానికి రూ.2,500, మణికంఠ ఎరువుల దుకాణానికి రూ.1000., సెలూన్‌కు రూ.1000, సాయిరాం ఎలక్ట్రికల్స్‌కు రూ.1000 జరిమానా విధించి రసీదులు అందజేశారు.
 
మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నాల్‌పల్లిలో పోచయ్యకు చెందిన పందులు హరితహారం మొక్కలను ధ్వంసం చేయడంతో అతడికి గ్రామ పంచాయతీ కార్యదర్శి జగదీశ్, సర్పంచ్ గణపురం సంతోష్‌రెడ్డి రూ. 1000 జరిమాన విధించారు.
 
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లిలో హరితహారంలో భాగంగా రోడ్డుపక్కన నాటిన 40 మొక్కలను గ్రామానికి చెందిన రైతు చిలుకోటి రాజిరెడ్డి ధ్వంసం చేయడంతో అతడికి పంచాయతీ కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి రూ. 19,000 జరిమానా విధించడంతోపాటు మొక్కలు తిరిగి నాటాలని నోటీసులు జారీచేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat