హిందూ ధర్మ ప్రచార యాత్రలో భాగంగా వారం రోజులుగా విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు దేవీ నవరాత్రుల ఉత్సవాలతో పాటు పలు చారిత్రక దేవాలయాలను, మహిమాన్విత క్షేత్రాలను సందర్శిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 5న , శనివారం నాడు కొమ్మల గ్రామంలోని గోవర్ధన్ గో గ్రామ్ ( గోశాల)ను శ్రీ స్వాత్మానందేంద్ర సందర్శించారు. స్వామివారు స్వయంగా గోవులకి పూజ చేసి తన ఇష్టం దైవం భగవాన్ శ్రీ కృష్ణుడిని పూజించారు. గోమాతలకు సేవ చేస్తున్న గోశాల యజమాని గోవర్ధన్‌ను కొనియాడారు. ఈ సందర్భంగా స్వామివారు మాట్లాడుతూ…హిందు ధర్మంలో గోవుకి చాలా ప్రాముఖ్యత ఉందని గోవు ఇంటి ముందు ఉంటే ప్రాణాంతక రోగాలు కూడా గుమ్మం దాటవు అని భక్తులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్వామి వారి ధర్మ ప్రచార యాత్ర రెండు తెలుగు రాష్ట్రాల సమన్వయ కర్త, దరువు ఎండీ చెరుకు కరణ్ రెడ్డి, నగర ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.