విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి హిందూ ధర్మ ప్రచార యాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలో దిగ్విజయవంతంగా కొనసాగుతోంది. హన్మకొండలో రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాల్లో శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు ప్రత్యేక పూజలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏడవరోజు రాజశ్యామల అమ్మవారి విగ్రహానికి పూలతో, ఆభరణాలతో అందంగా అలంకరణలు చేసి వివిధ పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామి వారిచే స్పటిక శివ లింగానికి రుద్రాభిషేకం నిర్వహించారు. శాస్త్రోక్తంగా చాండీ పారాయణతో చండీ హోమం నిర్వహించారు. భక్తి శ్రద్దలతో పలు పూజలు, అభిషేకం, హారతి, నైవేద్యం, సేవ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. భజనలు, భక్తి కీర్తనలతో, మంగళ హారతులతో మైమరిచే విధంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. ఏడో రోజు కార్యక్రమాలకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వ్.లక్ష్మికాంత రావు దంపతులు, వరంగల్ అర్బన్ జెడ్పీ చైర్మన్ డా. మారెపల్లి సుధీర్ కుమార్, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ దంపతులు, వొడితల కుటుంబ సభ్యులు ప్రణవ్, కపిల్, ఇంద్రనీల్, పూజిత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు శ్రీశ్రీశ్రీ స్మాత్మానందేంద్ర స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు, తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు.
పూజల అనంతరం శ్రీశ్రీశ్రీ స్మాత్మానంద సరస్వతి మహాస్వామి వారు మాట్లాడుతూ… మనలో ఉన్న ఉత్సాహాన్ని పైకి వ్యక్తీకరించటమే ‘ఉత్సవం’ అంటారని. నవరాత్రి అనేది పెద్ద ఉత్సవం అంటే..మహోత్సవం అని.. ఇదే దేవీ శరన్నవరాత్రి పూజా మహోత్సవాల అంతరార్థమని బోధించారు. చలించని మనస్సు, భ్రమించని దృష్టివలన ఏకాగ్రత సాధ్యమవుతుందని, నిష్కామబుద్ధితో తోటివారికి తోడ్పడుతూ, సమస్త జీవులపట్ల దయ, ప్రేమ, కరుణలను చూపిస్తూ, విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ, విశ్వకల్యాణాన్ని కాంక్షిస్తే ఏకాగ్రత సాధ్యమవుతుందని, ఇందుకు సంబంధించిన ‘ధ్యానం’. ధ్యానయోగాన్ని ప్రసాదించేది.. జగన్మాత శరన్నవరాత్రి పూజ మాత్రమే అన్నది భక్తులు, మానవులు గుర్తించాలన్నారు. ఆర్తితో అమ్మా అని పిలిస్తే నేనున్నానంటూ ఆప్యాయంగా అక్కు జేర్చుకునే ఆ తల్లికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలమని.. త్రికరణ శుద్ధిగా ఆ జగన్మాతకు సేవచేసే భాగ్యం నవరాత్రుల రూపంలో లభించడం మన జన్మకు లభించిన అద్భుత వరమని ప్రవచించారు. దేవి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి.లక్ష్మీకాంత రావు నివాసంలో శనివారం నాడు కుమారి డా వొడితల పూజిత ఆధ్వర్యంలో చిన్నారులు పాడిన భక్తి గీతాలు అలరించాయి. అన్నమయ్య, త్యాగరాజ కీర్తనలతో పాటు, పలువురు సంగీత శిక్షణ పాఠశాల విద్యార్థులు భక్తి గీతాలు, భజనలు శ్రావ్యంగా ఆలపించారు. రాజ్య సభ సభ్యులు కెప్టెన్ సతీమణి సరోజినీదేవి, ఎమ్మెల్యే సతీష్ కుమార్ సతీమణి డా. శమిత తదితరులు దాండియా, కోలాట ఆటలు, పాటలు, నృత్యాలతో సందడి చేసారు. ఈ కార్యక్రమంలో స్వామి వారి ధర్మ ప్రచార యాత్ర రెండు తెలుగు రాష్ట్రాల సమన్వయ కర్త, దరువు ఎండీ చెరుకు కరణ్రెడ్డి, నగర ప్రముఖులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.