విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి తొలిసారిగా హిందూ ధర్మ ప్రచారయాత్రను ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ప్రారంభించిన సంగతి విదితమే. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 8 వ తేదీ వరకు స్వామివారు వరంగల్‌లోనే పర్యటిస్తారు. ధర్మ ప్రచారయాత్రలో భాగంగా హన్మకొండలోని కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో జరుగుతున్న దేవీ నవరాత్రుల ఉత్సవాలలో శ్రీ రాజశ్యామల అమ్మవారిని నిత్య పీఠపూజలు చేసిన అనంతరం స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఈ సందర్భంగా స్వామివారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుంటున్నారు. ఇవాళ తెలంగాణ ఆర్థికమంత్రి తన్నీరు హరీష్‌రావు శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతిని దర్శించుకున్నారు. స్వామివారు మంత్రికి ఆశీర్వవచనాలు పలికారు. హరీష్‌రావుతో పాటు వర్థన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష, చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్, రాష్ట్ర వికలాంగుల చైర్మన్ వాసుదేవ్ రెడ్డి, రుణ విమోచన చైర్మన్ నాగుర్ల వెంకన్న, తెరాస రాష్ట్ర నాయకులు మార్నేని రవీందర్ రావు దంపతులు, తదితరులు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్, ధర్మ ప్రచారయాత్ర రెండు తెలుగు రాష్ట్రాల కన్వీనర్, దరువు ఎండీ సీహెచ్ కరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.