తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా మూసీకి చెందిన నిన్న శనివారం రాత్రి తొలగిన మూసి గేట్ ను 48 గంటల్లో అమరుస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రకటించారు. ఈ నెల 9 నాటికి మూసిని పూర్తి స్థాయిలో మరమ్మతులు పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. నీటి ఉధృతికి మూసి డ్యామ్ కు చెందిన 5 వ నేoబర్ గేట్ తొలగిందన్న సమాచారం తో మంత్రి జగదీష్ రెడ్డి హుటాహుటిన శనివారం రాత్రి మూసి డ్యామ్ మీదకు చేరుకుని పరిస్థితులు సమీక్షించిన విషయం విదితమే.
ఇదే విషయమై మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకురావడంతో పాటు పరిస్థితులను సమీక్షించారు. ఈ క్రమంలో తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తన వ్యక్తి గత కార్యదర్శి స్మితా సబర్వాల్ తో పాటు నీటిపారుదల ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ మురళీధర్ రావులను ఉన్నఫళoగా మూసిని సందర్శించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అదేశంతో ఆఘమేఘాల మీద హెలికాప్టర్ లో ఈ మద్యాహ్నం సూర్యపేట కు చేరుకున్న స్మితసబర్వాల్, మురళీధర్ రావు లు రోడ్డు మార్గంలో మూసి డ్యామ్ మీదకు చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న నీటిపారుదల ఇంజినీరింగ్ నిపుణులతోపాటు స్మితా సబర్వాల్, మురళీధర్ రావులతో మంత్రి జగదీష్ రెడ్డి డ్యామ్ మీదనే ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
నిపుణులు తమ వద్ద సిద్ధంగా ఉంచుకున్న డ్యామ్ వివరాలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మొత్తం సమీక్షించిన మీదట 1991 ప్రాంతంలో మూసి కోసమే ప్రత్యేకంగా తయారు చేసిన ఐదు గేట్లను అదనంగా తయారు చేశామని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అయితే అప్పట్లో తిరుపతిలో సమీపంలో నిర్మిస్తున్న కల్యాణి డ్యామ్ కు తరలించడం జరిగిందని వాటిలో రెండు అక్కడ వినియోగించుకోగా మూడు మిగిలి ఉన్నాయని నిపుణులు మంత్రికి వివరించారు. ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం మేరకు రంగంలోకి దిగిన ఉన్నతాధికారుల సూచనతో తిరుపతి నుండి ఆ మూడు గేట్లు తెప్పించి 48 గంటల్లో అమార్చనున్నట్లు తెలిపారు.
అంతే గాకుండా ఈ నెల 9 నాటికి మూసి డ్యామ్ మరమ్మత్తులు పూర్తి చేసి వృధాగా పోతున్న నీటిని నిలువరించనున్నట్లు వారు మంత్రికి తెలిపారు. ఇదే విషయమై మంత్రి జగదీష్ రెడ్డి సమీక్షా సమావేశం అనంతరం మీడియాకు వివరాలు వెల్లడిస్తూ మూసి ఆయకట్టు రైతాంగానికి ఎటువంటి భయాందోళనలకు గురికావొద్దని కోరారు. రైతాంగాన్ని అదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మార్గాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు అదేశించినందున వదంతులను నమ్మ వద్దని హితవు పలికారు. మూసి కుడి ఎడమ కాలువల రైతాంగానికి సమృద్ధిగా నీరు అందించే ఏర్పాట్లు జరుగుతున్నందున రైతులు, ప్రజలు సంయమనం పాటించాలని ఆయన కోరారు .
Post Views: 256