విశాఖ శారదాపీఠం పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారి ఆశీస్సులతో ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు హిందూ ధర్మ పరిరక్షణార్థం ధర్మ ప్రచార యాత్రను తెలంగాణ నుంచి ప్రారంభించారు. ముందుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్వామివారు యాత్రను ప్రారంభించారు. ఈ ధర్మ ప్రచారయాత్ర 58 రోజుల పాటు సాగనుంది. తొలుత ఉత్తర తెలంగాణ, తదుపరి దక్షిణ తెలంగాణలో స్వామివారు పర్యటిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సెప్టెంబర్28 న శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి ధర్మ ప్రచార యాత్ర ప్రారంభమైంది. ధర్మ ప్రచారయాత్రలో భాగంగా కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో నిర్వహిస్తున్న దేవి నవరాత్రుల కార్యక్రమంలో స్వామివారు స్వయంగా శ్రీ రాజశ్యామల దేవి పీఠపూజ, చండీయాగం, కుంకుమపూజ, రుద్రాభిషేకం వంటి పూజాది కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా స్వామివారు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి భక్తులకు వైదిక ధర్మ విశిష్టత గురించి ప్రవచిస్తున్నారు. ధర్మ ప్రచారయాత్ర సందర్భంగా కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో దేవి నవరాత్రుల ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్న సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు, అధికారులు, సెలబ్రిటీలు స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదం పలుకుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యంవినయ్ భాస్కర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ వినోద్‌కుమార్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ఇంటలిజెన్స్ ఐటీ నవీన్‌చంద్, వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్, మాజీ ఎంపీ తెరాస మహిళా అధ్యక్షురాలు గుండు సుధారాణి, బసవరాజు సారయ్య, ట్రాన్స్‌కో ఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు తదితర ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదం పొందారు.
హిందూ ధర్మ ప్రచార యాత్రలో భాగంగా ప్రతి రోజూ కెప్టెన్ ఇంట్లో దేవినవరాత్రుల పూజల అనంతరం స్వామివారు వరంగల్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన పలు చారిత్రక, ఆధ్యాత్మిక దేవాలయాలను, క్షేత్రాలను సందర్శిస్తున్నారు. వేయి స్తంభాల గుడి, పైడిపల్లి అమ్మవారి సమేత పురాతన శివాలయం, గోవిందరాజుల గుట్టపై అభయాంజనేయ స్వామి ఆలయం, మడికొండ మెట్టు రామలింగేశ్వరస్వామి ఆలయం, కొత్తకొండ వీరభద్ర ఆంజనేయస్వామి ఆలయం, కాశీబుగ్గ శ్రీ కాళీ విశ్వేశ్వరఆలయం, ఇలా..పలు ఆలయాలను సందర్శించిన స్వామివారికి అర్చకులు, భక్తులు పూర్ణకుంభంతో , పూలవర్షం కురిపిస్తూ అపూర్వ స్వాగతం పలికారు. ఆలయాల్లో దేవతామూర్తులకు స్వామివారు ప్రత్యేక పూజలు చేసి భక్తులకు సనాతన హిందూ ధర్మ గొప్పతనం గురించి సందేశం ఇస్తున్నారు. అంతే కాకుండా వరంగల్ నగరంలో కాలనీల్లో, వీధుల్లో ఏర్పాటు చేసిన దేవి నవరాత్రుల వేదికల్లో స్వామివారు పాల్గొని అమ్మవార్లకు పూజలు చేసి భక్తులను అనుగ్రహిస్తున్నారు. అలాగే భక్తుల మేరకు స్వామివారు స్వయంగా పాదపూజలలో పాల్గొంటున్నారు. ఈ మేరకు జిల్లాలోని పలు పట్టణాలు, గ్రామాలు, పల్లెలలోని తమ ఇండ్లకు విచ్చేస్తున్న స్వామివారికి భక్తులు సంప్రదాయబద్ధంగా నీళ్లు ఆరబోస్తూ, పూలవర్షం కురిపిస్తూ ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. వాడవాడలా, పల్లెపల్లెనా, ఇంటింటికీ తిరుగుతూ..హిందూ ధర్మ ప్రచారం గావిస్తున్న స్వామివారికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కాగా అక్టోబర్ 8 రాత్రి స్వామివారు వరంగల్ పర్యటన ముగించుకుని కరీంనగర్‌కు వెళతారు. స్వామి హిందూ ధర్మ ప్రచారయాత్ర కన్వీనర్, దరువు ఎండీ సీహెచ్ కరణ్ రెడ్డి తదితరులు స్వామివారి పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లను స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.మొత్తంగా విశాఖ శ్రీశారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారి హిందూ ధర్మ ప్రచార యాత్రకు అపూర్వ స్పందన వస్తోంది.
శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి హిందూ ధర్మ ప్రచారయాత్రకు అపూర్వ స్పందన..!
శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి హిందూ ధర్మ ప్రచారయాత్రకు అపూర్వ స్పందన..!
Posted by Sri Saradapeetam on Friday, 4 October 2019