తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఉప ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇప్పటికే ఈ ఉప ఎన్నికల బరిలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ తరపున మాజీ ఎమ్మెల్యే ఎన్ పద్మావతి రెడ్డి,అధికార టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి లను నిలిపింది. ఎన్నికల ప్రచారంలో పలు పార్టీలు దూసుకుపోతున్నాయి.
ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్ తరపున మంత్రి,ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ఈ షోలో మంత్రి కేటీ రామారావు మాట్లాడుతూ” హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజల అభిమానం తమకు ఉంది. అందుకే ఈ నెల ఇరవై ఒకటో తారీఖున జరగబోయే ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గుర్తు అయిన కారుకే ఓట్లు వేస్తారు.
ఇరవై నాలుగో తారీఖున విడుదల కానున్న ఉప ఎన్నికల ఫలితాల్లో కారుదే ప్రభంజనం అని “ఆయన అన్నారు.ఇన్నేళ్లు నియోజకవర్గం వెనుకబాటుకు కారణం ఎవరో ప్రజలు గుర్తించాలి. దశాబ్ధాల పాటు కాంగ్రెస్ పాలనలో నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ఆయన విమర్శించారు.కాంగ్రెస్ కు ఓటు వేసి జీ హుజూర్ అందామా? టీఆర్ఎస్ కు ఓటు వేసి ఆత్మగౌరవంతో జై హుజూర్ నగర్ అందామా..? అని కేటీఆర్ పిలుపునిచ్చారు.