మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన భారీ చారిత్రక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’… రేనాటి వీరుడు.. తొలి స్వతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితకథ నేపథ్యంతో అత్యంత్ర ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో భారీ వసూళ్లు రాబడుతోంది.
గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న (బుధవారం) ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ. 100 కోట్లు రాబట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రధాన మార్కెట్ అయిన ఏపీ, తెలంగాణలో ఈ సినిమా సత్తా చాటుతోంది. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజే సైరా రూ. 32 కోట్లు రాబట్టింది. పాజిటివ్ టాక్ ఉండటంతో తొలి మూడు రోజుల్లో సైరాకు భారీగా వసూళ్లు దక్కినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా నైజాంలో ఈ సినిమా తొలి మూడు రోజుల్లో రూ. 14.62 కోట్లు రాబట్టింది. ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా ఈ విషయాన్ని ట్వీట్ చేస్తూ.. నైజాంలో మూడురోజుల కలెక్షన్ వివరాలు (తొలిరోజు రూ. 8.10 కోట్లు, రెండోరోజు రూ. 3.98 కోట్లు, మూడో రోజు రూ. 2.54 కోట్లు) ట్విటర్లో వెల్లడించారు. ఇక ఓవర్సీస్ మార్కెట్లోనూ సైరా సత్తా చాటుతోంది. మూడు రోజుల్లో అమెరికాలో ఈ సినిమా రూ. 1.5 మిలియన్ డాలర్లు (రూ. 10.62 కోట్లు) రాబట్టిందని రమేశ్ బాలా మరో ట్వీట్లో వెల్లడించారు.