హుజూర్‌నగర్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత రాజకీయాలకు అద్దం పడుతోందని ప్రచారం జరుగుతోంది. పట్టుబట్టి తన సతీమణికి టికెట్ ఇప్పించుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆ పార్టీ నేతలే చుక్కలు చూపిస్తున్నారు. పార్టీ సీనియర్ లీడర్లు ప్రచారం వైపు కన్నెత్తి చూడటం లేదు. ఎన్నికలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటి వ్యవహారం అయినట్టు.. దూరంగా ఉండిపోతున్నారు. ఎంపీ రేవంత్ రెడ్డి.. ప్రచారం చేసేది లేదంటూ.. తన వర్గీయులతో చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హుజూర్ నగర్ లో ఉత్తమ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది.
మరోవైపు అధికార టీఆర్‌ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశంతో గులాబీ నేతలు, శ్రేణులతో కలిసి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. దాంతో భయపడిపోయిన ఉత్తమ్.. ఏకంగా బీజేపీతోనే లోపాయికారీ ఒప్పందానికి సిద్ధమవుతున్నారు. ఆ పార్టీ నేతలతో కలిసి మంతనాలు సాగించినట్లు సమాచారం. నామమాత్రపు పోటీ చేసేందుకు బీజేపీ బరిలో నిలిచిందని కాంగ్రెస్ వర్గాలు చెపుతున్నాయి. టీడీపీ అభ్యర్థి కూడా బరిలో ఉండటంతో ఓట్లు చీలితే ప్రయోజనం జరుగుతుందని ఆశపడుతున్నారు. ప్రచారాన్ని గాలికొదిలేసి.. అక్రమమార్గాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టి కేంద్రీకరించారు. దాంతో పార్టీ క్యాడర్ కూడా.. అయోమయానికి గురవుతోంది. మొత్తంగా హుజూర్ నగర్ ఉప ఎన్నికలు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.