ఆసక్తిని రేకెత్తిస్తున్న మహారాష్ట్ర ఎన్నికల్లో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే తనయుడు ఆదిత్య థాక్రే వినూత్నంగా ప్రచారంలోకి దిగుతున్నారు. శివసేన యూత్ వింగ్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆదిత్య ఈ సారి ఎన్నికల బరిలో ఉన్నారు. దీంతో వివిధ భాషల్లో వర్లీ ప్రజలను ప్రసన్నం చేసుకుంటున్నారాయన. నమస్తే వర్లీ అంటూ ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. వర్లీలో ఇప్పుడీ పోస్టర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఇదిలాఉండగా, నిన్న ఆదిత్య నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లే ముందు ఆదిత్య.. ఇంట్లోనే శివసేన వ్యవస్థాపకుడు, తాతయ్య బాలా సాహేబ్ థాకరే ఫోటో వద్ద ఆస్సులు తీసుకున్నారు. ఆదిత్య థాకరే తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. ఆయన ఆస్తి మొత్తం 16 కోట్ల 5 లక్షలు. అతని వద్ద ఓ బీఎండబ్ల్యూ కారు కూడా ఉన్నది. ఎన్నికల అఫిడవిట్‌లో ఈ వివరాలను ఆదిత్య పేర్కొన్నారు.
శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే మీడియాతో మాట్లాడుతూ, తమ కుటుంబంలో సామాజిక సేవ చేసే సాంప్రదాయం ఉందని, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని ముందు అనుకున్నాం, కానీ పరిస్థితులు మారాయి, నియోజకవర్గ ప్రజల కోసం ఆదిత్య ఎప్పుడూ అండగా ఉంటారని భావిస్తున్నట్లు ఉద్దవ్ తెలిపారు. భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు.