విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి హిందూ ధర్మ ప్రచార యాత్ర వరంగల్ నగరంలో విజయవంతంగా సాగుతోంది. నాలుగురోజు బుధవారం రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో జరుగుతున్న శరన్నవరాత్రులలో స్వామివారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారు శ్రీ రాజశ్యామల అమ్మవారికి పీఠపీజ, చండీ పారాయణం, చండీ హోమం, లలితా సహస్ర నామార్చన, రుద్రాభిషేకం వంటి ప్రత్యేక పూజలను వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య అద్భుతంగా నిర్వహించారు. వేదపండితులు రుద్రంనమక చమకం, శ్రీ సూక్తం, పురుష సూక్తం పఠిస్తుండగా… వివిధ రకాల పూలతో, పత్రితో, భస్మంతో, పంచామృతాలతో శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారు స్వయంగా చేసిన అభిషేకం భక్తులను, మహిళలను మంత్ర ముగ్దులను చేసింది. పూజల అనంతరం భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్వామి వారు భక్తులకు ఉపదేశం చేసారు. నేటి కాలంలో మనిషి సంసార బాంధవ్యాలలో చిక్కుకుపోయాడని, మానసిక ప్రశాంతత నేటి యువతకు, నేటి సమాజానికి లేకుండా పోయాయని, మనుష్యులు యాంత్రిక జీవనానికి అలవాటు పడ్డారని, వీటినుండి విముక్తి లభించాలంటే.. ఆధ్యాత్మిక చింతన ఒక్కటే మార్గమని స్వామివారు ప్రవచించారు. ప్రతిరోజు భగవత్ ధ్యానం చేయాలని, దేవాలయాలను సందర్శించడం, దాన ధర్మాలు చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ దేవి శరన్నవరాత్రులు అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనవని, ఇతిహాసాల్లో అమ్మవారి ప్రాశస్త్యం గురించి విపులంగా వివరించబడి ఉందన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి పూజలు చేస్తారని, వివిధ రకాల నైవేద్యాలు సమర్పిస్తారని తద్వారా అమ్మవారి అనుగ్రహం లభిస్తుందన్నారు. మనది వేద భూమి అని, ఏ దేశానికి లేని విభిన్న సంస్కృతి, సాంప్రదాయాలు మన దేశంలో ఉన్నాయని, వేదాలను కాపాడుకోవాలని స్వామివారు అన్నారు. హిందూ సనాతన ధర్మాన్ని రక్షించినప్పుడే అది మన దేశాన్ని రక్షిస్తుందని, మానవులే నైతిక విలువలకు ప్రాధాన్య మివ్వాలని ఆయన ప్రవచించారు. కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో జరుగుతున్న ఈ దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజా కార్యక్రమాలలో పాల్గొని శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారి ఆశీర్వాదం పొందుతున్నారు. ఈ కార్యక్రమంలో స్వామివారి ధర్మ ప్రచారయాత్ర సమన్వయకర్త , దరువు ఎండీ సీహెచ్ కరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
