ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాల్లో కార్పొరేట్ కంపెనీల తరహాలో ఆఫీసులను తీసుకురాబోతున్నారు. రిసెప్షనిస్ట్ మాదిరిగా డిజిటల్ అసిస్టెంట్ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. డిజిటల్ అసిస్టెంట్ స్వయంగా అర్జీ తీసుకుని ప్రాథమిక పరిశీలనచేసి సంబంధిత అధికారికి పంపిస్తారు.. సచివాలయంలో సేవలకోసం వచ్చేవారితో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలి. ఏకపక్ష గవాక్ష పద్ధతి అంటే (సింగిల్ విండో) సేవలు అందించాలి. సేవల కోసం ఎవరు ముందు వస్తారో వారి పనులే జరగాలి.
ఎట్టి పరిస్థితుల్లో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చూడాలి. జనన, మరణాల నమోదు, ఆస్తి పన్ను మదింపు, ఇతర పన్నుల వివరాలన్నీ ఆన్‌లైన్‌లో పొందుపరుస్తూ ఉండాలి. ప్రస్తుతం అమలవుతున్న సాఫ్ట్‌వేర్లను పంచాయతీ కార్యదర్శి అనుమతితో నిర్వహిస్తుండాలి. సచివాలయ ఉద్యోగులు సంబంధిత శాఖల పర్యవేక్షణలో విధులు నిర్వహించాలి. ఎప్పటికప్పుడు ఆయా శాఖల ఉన్నతాధికారులు వారి పనితీరుపై సమీక్షలు చేస్తుంటారు. ప్రజలకు, ఉన్నతాధికారులకు జవాబుదారీతనంగా ఉండాలి.