దక్షిణాఫ్రికాపై టెస్టుల్లో ఇద్దరు టీమిండియా ఓపెనర్లు ఒకే ఇన్నింగ్స్‌లు సెంచరీ చేయడం ఇదే తొలిసారి అయితే.. రోహిత్ శర్మ డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని వదిలేశాడు. రోహిత్ వదిలిస్తే.. నేను ఉన్నాను కదా అన్నట్లు మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ బాదేశాడు. ఆడేది ఐదో టెస్టు మ్యాచ్.. అయితేనేం తొలి టెస్టు శతకాన్ని ఎలా ద్విశతకంగా మార్చుకోవాలో చేసి చూపించాడు. టెస్టు క్రికెట్ అంటే సుదీర్ఘంగా ఆడటమే కాదు.. అవసరమైతే బౌండరీల మోత మోగించడంలోనూ ఏమాత్రం వెనక్కి తగ్గది లేదని నిరూపించిన మయాంక్ డబుల్ కొట్టేశాడు. సెంచరీ సాధించడానికి 203 బంతులు ఎదుర్కొంటే.. దాన్ని డబుల్ సెంచరీగా మలుచుకోవడానికి మరో 155 బంతులు ఆడాడు. ఓవరాల్‌గా 22 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో ద్విశతకం నమోదు చేశాడు.
202/0 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం రెండో రోజు ఆట కొనసాగించిన భారత్ 317 పరుగుల వద్ద రోహిత్ వికెట్‌ను కోల్పోయింది. ఈ రోజు ఆటలో మరో 115 పరుగులు జత చేసిన తర్వాత రోహిత్ శర్మ ఔటయ్యాడు. ఓపెనర్‌గా ఇన్నింగ్స్ ఆరంభించిన తొలి టెస్టులోనే రోహిత్ డబుల్ సెంచరీ సాధిస్తాడనుకున్నప్పటికీ ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. మహరాజ్ వేసిన 82 ఓవర్ ఆఖరి బంతిని ముందుకొచ్చి ఆడబోయిన రోహిత్ స్టంపింగ్ అయ్యాడు. దాంతో భారత్ తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కాగా, మయాంక్ మాత్రం అత్యంత నిలకడగా ఆడాడు. టెస్టు స్పెషలిస్టు చతేశ్వర్ పుజారా(6) విఫలమైన చోట, రికార్డుల వీరుడు కోహ్లి(20) నిరాశపరిచిన వేళ.. మయాంక్ మాత్రం సొగసైన టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇది తన మార్కు ఆటంటూ డబుల్‌తో ఇరగదీశాడు. ఫలితంగా టెస్టు క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన 23వ భారత క్రికెటర్‌గా మయాంక్ గుర్తింపు పొందాడు.