కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు తెలుగురాష్ట్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.. ఉత్సవాల్లో ఐదో రోజు ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారు శ్రీ లలితా త్రిపురసుందరీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. శరన్నవరాత్రి మహోత్సవాలలో అమ్మవారిని శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా అలంకరిస్తారు. త్రిమూర్తులకన్నా పూర్వంనుంచే ఉంది కాబట్టి త్రిపురసుందరి అని పిలువబడుతోంది. ఈదేవియే శ్రీచక్ర అధిష్టానశక్తిగా, పంచదశాక్షరీ మహామంత్రాధిదేవతగా తనని కొలిచే భక్తుల్ని, ఉపాసకుల్ని అనుగ్రహిస్తోంది.
లక్ష్మీ దేవి, సరస్వతీ దేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తుండగా చిరు మందహాసంతో, భక్తి పావనాన్ని చిందే చెరకు గడను చేతపట్టుకొని శివుని వక్షస్థలం పై కూర్చొనిదేవి దర్శనమిస్తుంది. శ్రీ లలితా త్రిపురసుందరీదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. వేలాదిగా తరలివస్తున్న భక్తులతో ఇంద్రకీలాద్రి రద్దీగా మారుతోంది. భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్నిరకాల ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకోనున్నారు.