గిరిజన ప్రాంతాల్లోని పిల్లల్లో, మహిళల్లో పోషకాహార లోపం అధిగమించే విధంగా అంగన్ వాడీ కేంద్రాలతో సమన్వయం చేసుకుని గిరిజన సంక్షేమ శాఖ పనిచేయాలని రాష్ట్ర గిరిజన, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పోషన్ అభియాన్ పథకం కింద అమలు చేస్తున్న గిరిపోషన్ పథకం పనితీరుపై, అమలులోని ఇబ్బందులపై మహిళా-శిశు సంక్షేమ శాఖ, గిరిజన శాఖ అధికారులు, సిబ్బందితో నేడు దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష నిర్వహించారు.
గిరిపోషన్ ద్వారా ప్రస్తుతం ఆరు కోట్ల రూపాయలతో 414 అంగన్ వాడీ కేంద్రాల ద్వారా 13వేల మందికి పోషకాహారాన్ని అందిస్తున్నామని, అయితే దీనిని గిరిజన ప్రాంతాలన్నింటికి వర్తింప చేసే విధంగా సిఎం కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తామని మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు చెప్పారు. కేంద్రం ఇస్తున్న దానిపై పూర్తిగా ఆధారపడకుండా రాష్ట్రంలోని మహిళలు, శిశువులు, గిరిజనుల ఆరోగ్య సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతైనా ఖర్చు చేస్తుందని తెలిపారు.
గిరిపోషన్ ద్వారా ఇచ్చే ఆహరం వెనుకబడిన గిరిజన బిడ్డలకు సరైన విధంగా అందే లక్ష్యంతో ఈ రెండు శాఖల అధికారులు అంకిత భావంతో పనిచేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ గారు కోరారు. పథకం అమలులో ఉన్న ఇబ్బందులన్నింటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లు మనసుపెట్టి తల్లుల్లా పిల్లలను చూసుకోవాలని విజ్ణప్తి చేశారు.