తెలంగాణ ధర్మ ప్రచార నిమిత్తం విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. వరంగల్ నగరంలో రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో జరుగుతున్న నవరాత్రుల ఉత్సవాలలో పాల్గొంటున్న స్వామివారు శ్రీ రాజశ్యామలాదేవికి పీఠపూజ, అర్చన, దుర్గాపూజ, లలితా సహస్రనామార్చన తదితర పూజాకార్యక్రమాలను శాస్తోక్తంగా నిర్వహిస్తున్నారు. ధర్మ ప్రచార యాత్ర లో భాగంగా వరంగల్ నగరంలోని వేయిస్థంభాల గుడి, పైడిపల్లిలోని పురాతన అమ్మవారి సమేత శివాలయం, గోవిందరాజుల గుట్టపై ఉన్న అభయాంజనేయ స్వామిఆలయాలను స్వామివారు సందర్శించి భక్తులను అనుగ్రహించారు. అలాగే వరంగల్ నగర భక్తుల కోరిక మేరకు స్వయంగా స్వామివారు వారి ఇండ్లకు వెళ్లి అమ్మవారికి పాదపూజలు నిర్వహిస్తున్నారు. నిన్న మంగళవారం కేసీఆర్ నగర్ లోని బానోతు కల్పన-సింగు లాల్ వేణుగోపాల్, కృష్ణమోహన్ ఇండ్లలో స్వామివారు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులను ఆశీర్వదించారు. అలాగే ఎన్టీవో కాలనీలో వెంకటేశ్వర్లు ఇంటితో పాటు కాలనీలో ప్రతిష్టించిన అమ్మ వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవాళ పాదపూజల్లో భాగంగా స్వామి వద్దిరాజు గణేష్, కార్పొరేటర్
వద్దిరాజు వెంకటేశ్వర రావు, వారి ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారు హిందూ ధర్మ గొప్పతనాన్ని వివరిస్తూ ప్రవచనం చెప్పారు. ఆ కార్యక్రమంలో ధర్మ ప్రచార యాత్ర సమన్వయకర్త, దరువు ఎండీ సిహెచ్. కరణ్ రెడ్డి , రాంమూర్తి పోలపల్లి తదితరులు పాల్గొన్నారు. మొత్తంగా వరంగల్లో స్వామివారి ధర్మ ప్రచార యాత్ర ఆద్యంతం ఆధ్యాత్మికత, భక్తిభావం చాటేలా సాగుతుండడం విశేషం.