కుట్ర పూరిత రాజకీయాలు చేసేవారు మహాత్మాగాంధీ బోధించిన శాంతి, అహింస గురించి ఎన్నటికీ అర్థం చేసుకోలేరని జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శించారు. భారత జాతిపిత గాంధీ 150వ జయంతి సందర్భంగా బుధవారం రాజ్‌ఘాట్ వద్ద సోనియా గాంధీకి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ గత ఐదేళ్లుగా దేశం లో జరుగుతున్న పరిణామాలకు గాంధీ ఆత్మ ఎంతో క్షోభించి ఉంటుందని మోదీ ప్రభుత్వాన్ని విమర్శించారు. తమను తాము గొప్పవాళ్లు గా భావించుకునే వ్యక్తులు దేశంకోసం గాంధీ చేసిన త్యాగాలను ఏనాటికీ అర్థంచేసుకోలేరన్నారు. ఇండియా, గాంధీ పర్యాయపదాలు.
అయితే కొంతమంది మాత్రం ఆరెస్సెస్, భారత్ పర్యాయపదాలుగా ప్రచారం చేసే పనిలోపడ్డారు. నయ వంచక రాజకీయాలు చేస్తున్నారని, శాంతి, అహింస అన్న మాటలు వాళ్లకు ఎన్నటికీ అర్థం కావన్నారు. ఈ సందర్భంగా సోనియా బీజేపీ మాతృసంస్థ ఆరెస్సెస్‌పై విమర్శలు కురిపించారు. గాంధీ సిద్ధాంతాలను, ఆదర్శాలను ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త ఆచరించాలని విఙ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ కూడా సోనియాతోపాటు రాజ్‌ఘాట్ సందర్శించారు. సత్యనిష్ఠతో ఉండమని.. సత్యమార్గంలో నడవాలని గాంధీ బోధించారు. బీజేపీ కూడా బాపూ బాటలో నడవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహిస్తోంది.