విధి నిర్వహణలో ఉన్న కోర్టు ప్రభుత్వ ఉద్యోగులను తోయటం, బెదిరించడం, మహిళా ఉద్యోగులపట్ల అసభ్యంగా ప్రవర్తించడం, న్యాయమూర్తుల్ని పరుష పదజాలంతో దూషించిన కేసులో అమలాపురం మాజీఎంపీ హర్షకుమార్‌ను అరెస్టు చేస్తామని ఏలూరు డీఐజీ ఏఎస్ ఖాన్ స్పష్టంచేశారు.హర్షకుమార్ ఇటీవల జరిగిన బోటు ప్రమాదంలో 93మంది ఉన్నారని ప్రజలను, వ్యవస్థను తప్పుదోవ పట్టించారన్నారు. ఆయనవద్ద ఉన్న సమాచారాన్ని ఇవ్వాలని నోటీసులిచ్చినా ఎటువంటి స్పందన లేదన్నారు. హర్షకుమార్ వద్ద 93మంది ఉన్నట్టు సమాచారాన్ని అధికారులకు అందిస్తే తద్వారా ప్రభుత్వాధికారులు ఆ విధంగా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉందన్నారు.
అటువంటివి ఏమీలేకుండా తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరించారన్నారు. గతనెల28న రాజమహేంద్రవరం కోర్టు స్థలంలో ఆక్రమణలు తొలగిస్తుండగా హర్షకుమార్ మధ్యాహ్నం సమయంలో వచ్చి జిల్లా న్యాయమూర్తిని పరుషపదజాలంతో మాట్లాడడం, అక్కడి కోర్టు ఉద్యోగులను బెదిరించడంతో పాటు, తోయడం, మహిళా ఉద్యోగినులతో అసభ్యకరంగా ప్రవర్తించారని జిల్లాకోర్టు పరిపాలనాధికారి త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో చేసిన ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేశామన్నారు. హర్షకుమార్‌ను అరెస్టు చేసేందుకు వెళితే పరారయ్యారని, ఆయనను అరెస్టు చేసేందుకు నాలుగు టీమ్‌లు ఏర్పాటుచేసి గాలింపు చర్యలు చేపట్టామన్నారు. హర్షకుమార్‌తోపాటుగా ఆయనకు సహకరించినవారిని అరెస్టు చేస్తామన్నారు. ఈవిధంగా ధిక్కార ధోరణిలో మాట్లాడి ప్రజల్ని తప్పుదోవపట్టించేవారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.