సంపూర్ణ మధ్య నిషేధం సీఎం జగన్ ఇచ్చిన హామీ.. ఎంత కష్టమైనా ఆపని చేయాలనేది జగన్ సంకల్పం.. అయితే తాజాగా జగన్ నిర్ణయానికి తొలి అడుగుపడింది. విచ్చలవిడిగా విక్రయాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రారంభం అయ్యాయి. పలుఆంక్షలతో విక్రయాలు జరిగాయి. కొత్త మద్యంపాలసీ మంగళవారం నుంచి అమలులోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా చాలా దుకాణాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా కొన్నిచోట్ల మినహా మిగిలిన అన్నిచోట్లా దుకాణాలన్నీ ప్రారంభమయ్యాయి. సూపర్ వైజర్ల పర్యవేక్షణలో ఉదయం11నుంచి రాత్రి 8వరకు మద్యం విక్రయాలు సాగాయి. ప్రతీ దుకాణం వద్ద వివరాలు, విక్రయవేళలు, ఎమ్మార్పీ ధరలతోపాటు మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే ఫ్లెక్సీలు, బోర్డులను ఏర్పాటు చేశారు.
గతంలో ఉదయం 10గంటలకే మద్యందుకాణాలు ప్రారంభమయ్యేవి. దీంతో మందుబాబులు పదిగంటలనుంచి మద్యం తాగేవారు. ఇప్పుడు మాత్రం మారిన వేళల ప్రకారం ఉదయం 11 గంటలనుంచి దుకాణాలు తెరవడం, మందుబాబులు దుకాణాల వద్ద మద్యం కోసం పడిగాపులు కాసారు. రాత్రి 8గంటలకు దుకాణాలు మూసివేస్తుండడంతో రాత్రి 7గంటల నుంచే క్యూలుకట్టారు. దీంతో దుకాణాల వద్ద కంట్రోల్ చేయడం సిబ్బందికి కష్టంగా మారింది. ఆయా ప్రాంత సిఐలు షాపుల్లో నూతనంగా ఏర్పాటు చేసిన సిబ్బందికి పలు సూచనలు, సలహాలిచ్చారు. మొత్తమ్మీద ప్రభుత్వ అధీనంలోకి మద్యం షాపులు తెచ్చి పనివేళల్లో మార్పులు తీసుకు రావడం పట్ల సర్వత్రా ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.