జై జవాన్.. జై కిసాన్…ఎంత గొప్ప నినాదం ఇది.. స్వర్గీయ మాజీ ప్రధాని, భారత రత్న లాల్ బహుదూర్ శాస్త్రి ఇచ్చిన ఈ నినాదం మరోసారి భారతీయుల హృదయాల్లో దేశభక్తిని తట్టి లేపుతోంది…చైనా దురాక్రమణ విషాదంలో నెహ్రూ మరణించిన తర్వాత దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు లాల్ బహద్దూర్ శాస్త్రి..అంతలోనే పాకిస్తాన్ తో యుద్దం వచ్చింది.. ఆ సమయంలో లాల్ బహుదూర్ శాస్త్రీజీ ధృఢచిత్తంతో వ్యవహరించారు..జై జవాన్, జైకిసాన్ నినాదంతో సైనికులతో పాటు యావత్ దేశంలో ఉత్తేజాన్ని రగిలించారు..దీంతో మన సైనం శత్రువులను చిత్తు చిత్తు చేసింది… దేశమంతా విజయ గర్వంతో మళ్లీ తలెత్తుకుంది.. దేశ రక్షణ బాధ్యతలు చూసే సైనికుడు, అందరికీ అన్నం పెట్టే రైతన్నలకు జై కొడుతూ లాల్ బహద్దూర్ శాస్త్రీ ఇచ్చిన ఈ నినాదం .నేటీకి ఉత్తేజరుస్తూనే ఉంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొగల్ సరాయ్ గ్రామంలో లాల్ బహదూర్ 1904 అక్టోబర్ 2న జన్మించారు. తండ్రి శారదాప్రసాద్ రాయ్ ఒక నిరుపేద.చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో లాల్ బహుదూర్ కుటుంబ ఆర్థికంగా చాలా చితికిపోయింది..చదువు కోవడానికి ఆయన అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు..స్కూల్ కు వెళ్లడానికి గంగానది ఈదుకుంటూ వెళ్లేవారు..అలా కష్టపడి చదువుకుంటూ మహాత్మాగాంధీ పిలుపు నందుకొని చదువుకు స్వస్తి చెప్పి బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సహాయ నిరాకరణోద్యమంలో చేరి అనేక సార్లు జైలు శిక్ష ననుభవించాడు. జైలు శిక్ష అనంతరం కాశీలోని వైద్యపీఠంలో అద్యయనం చేసి “శాస్త్రి” అనే పట్టా అందుకున్నారు. అప్పటినుంచి లాల్ బహదూర్ శాస్త్రి అయ్యాడు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి లాలా లజపతిరాయ్, జవహర్ లాల్ నెహ్రూ, మహాత్మాగాంధీ, పండిట్ గోవిందవల్లభ్, పండిట్ వంటి మహాత్ముల ఆశీస్సులు పొంది, ఇటు ప్రజలలోనూ, అటు నాయకులలోనూ ఉత్తమ నాయకుడనే పేరు పొందారు..బ్రిటీషు వారి పక్కలో బల్లెంగా తయారయ్యి దేశ స్వాతంత్ర్యం సమరంలో అత్యంత కీలకమైన పాత్ర వహించారు.
1964లో నెహ్రూ అకాల మరణం వలన ప్రధాన మంత్రి పదవిని అధిష్టించి తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు శాస్త్రీజీ. ప్రధాన మంత్రిగా రష్యా పర్యటించినప్పుడు శాస్త్రిని అతి నిరాడంబరంగా మామూలు చెప్పులు, సామాన్య దుస్తులతో చూసిన రష్యా ప్రజలు నివ్వెరపోయారు. శాస్త్రీజీ జీవితం నేటి రాజకీయ ఆదర్శం కావాలి.. గాంధీజీ మాదిరిగానే నిరాడంబరంగా జీవించారాయన.. నెహ్రూ కేబినెట్ లో శాస్త్రి రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు 1956లో “అరియలూరు” లో రైలు ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణీకులకు భద్రత కల్పించలేకపోయానన్న పశ్చాతాపంతో నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేశారు..ఆ విషయంలో నెహ్రూ నచ్చజెప్పినా సంతృప్తి పడని శాస్త్రి తన నిర్ణయం మార్చుకోలేదు.ఈ రోజుల్లో అవినీతికి పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయినా ఇంకా సిగ్గులేకుండా పదవులను అంటి పెట్టుకునే నాయకులనే చూశాం కానీ, శాస్త్రి లాంటి గొప్ప నేతలు ఇప్పుడు కనుచూపుమేరలో కనిపించకపోవడం బాధాకరం.. భారత్ పాక్ ల మధ్య తాష్కెంట్ లో జరిగిన చర్చల తర్వాత అదే రాత్రి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు … లాల్ బహదూర్ శాస్త్రీ జీ దేశ ప్రధానిగా ఉన్నది కొద్ది రోజులే అయినా తన నిరాడంబరత్వంతో, అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించి ఆ పదవికే వన్నెతెచ్చారు.. నేడు ఆయన 115వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘనంగా నివాళులు అర్పిస్తోంది మా దరువు.కామ్.