గ్రామ సచివాలయాల ద్వారా మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం నెరవేరుతోందన్నారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన సచివాలయాలను గాంధీ జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కరపలో సీఎం ప్రారంభించారు. అంతకుముందు ముఖ్యమంత్రి పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రసంగించారు. గాంధీ జయంతి రోజున ఆయన సేవలను స్మరించుకోవాలని, అవినీతి రహిత పాలనే లక్ష్యంగా చేసిన గొప్పప్రయత్నమే సచివాలయ వ్యవస్థ అన్నారు. సచివాలయాల ద్వారా ప్రతీగ్రామంలో 10శాశ్వత ఉద్యోగాలు కల్పించామన్నారు.
ప్రతీ రెండువేలమంది జనాభాకు ఒక సచివాలయంను ఏర్పాటుచేసినట్లు సీఎం వివరించారు. సచివాలయ ఉద్యోగులందరికీ స్మార్ట్‌ఫోన్లు అందిస్తామని సీఎం ప్రకటించారు. అలాగే ప్రతి 50ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమించామన్నారు. ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే 4లక్షల ఉద్యోగాలు కల్పించిన చరిత్ర దేశంలో ఎక్కడా లేదని, లక్షా 34వేల 978 మందికి శాశ్వత ఉద్యోగాల కల్పన రికార్డ్ అన్నారు. గ్రామాల్లోనే 500కి పైగా ప్రభుత్వసేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు. 2020 జనవరి1నాటికి సచివాలయాల్లో పూర్తిసేవలు అందుబాటులోకి రానున్నాయని సీఎం తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్ది ప్రభుత్వ పథకాలను, పాలనను ప్రతీ గడపకు తీసుకెళ్లడం తమ ధ్యేయమన్నారు.