తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ,నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు అనివార్యమైన సంగతి విదితమే. అందులో భాగంగానే ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఎన్నికలు జరగనున్నాయి.
ఇరవై నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్ ,కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించింది. నామినేషన్ల పర్వం కూడా ముగియడంతో ప్రచారంలో దూసుకుపోతున్నాయి.
టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి బరిలోకి దిగుతుంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ తరపున ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డి బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీ అయిన సీపీఐ హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకే మద్దతు ప్రకటించింది. నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడా వెంకట రెడ్డి తెలిపారు.