టీమ్ ఇండియా యువ క్రికెటర్ పృథ్వీ షా కొత్తగా ప్రాక్టీస్ చేయనున్నాడు. భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుతో కలిసి హైదరాబాద్‌లో సాధన చేయాలని నిర్ణయించుకున్నాడు. ఫుట్‌వర్క్ మెరుగుపరచుకునేందుకు వృతి విలువలు పెంపొందించుకునేందుకు షా ఈ నిర్ణయం తీసుకున్నాడు. నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నందుకు 19ఏండ్ల ముంబై క్రికెటర్ ప్రస్తుతం నిషేధం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. నవంబర్ 15తో అతనిపై విధించిన నిషేధం తొలగిపోనుంది. ఈ నేపథ్యంలోనే అతడు సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌తో సిరీస్‌లకు దూరమయ్యాడు. ఓవరాల్ ఫిట్నెస్తో పాటు అత్యుత్తమ ఫీల్డర్‌గా మారేందుకు షా కొత్తగా కసరత్తులు చేసేందుకు సిద్ధమైనట్లు షా సన్నిహితుడొకరు తెలిపారు.
మైదానంలో షా అంత చురుగ్గా కదల్లేకపోవడంతో చాలా సార్లు విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ఆ వైఫల్యాన్ని అధిగమించేందుకు బెస్ట్ ఫీల్డర్‌గా నిలువాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. తాను వర్కవుట్స్ ఎలా చేస్తానో తెలిపే వీడియోను ఇటీవల సింధు సోషల్‌మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఫుట్‌వర్క్ మెరుగుపరచుకునేందుకు దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ రెగ్యులర్‌గా బ్యాడ్మింటన్ ఆడేవాడు. బంతిని వీలైనంత త్వరగా గుర్తించే సామర్థ్యాన్ని మెరుగుపరచుకునేందుకు మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్ టేబుల్ టెన్నిస్ సాధన చేసేవారు. మాజీ క్రికెటర్ల తరహాలోనే షా కూడా ఆటలో ఉన్నతస్థాయికి చేరుకునేలా సన్నద్ధం కావాలని భావిస్తున్నాడు.