తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 30న అంటే సోమవారం నాడు అధికారికంగా ప్రారంభయ్యాయి. తిరుమలలలో తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక సోమవారం తొలిరోజు స్వర్ణ తిరుచిలో ఉత్సవమూర్తులను ఊరేగించారు. తదనంతరం ధ్వజారోహణం కార్యక్రమంతో అధికారికంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి కాగా బ్రహ్మోత్సవాల తొలి రోజు ఆనవాయితీ ప్రకారం రాత్రి 7.21 నిమిషాలకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్వామివారికి స్వయంగా పట్టువస్త్రాలు సమర్పించారు. తొలిరోజు పెద్దశేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా కొలువుదీరిన మలయప్పస్వామి మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చాడు. ఇవాళ మంగళవారం రెండవరోజు కూడా శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మలయప్పస్వామి ఐదు తలల చిన్నశేష వాహనంపై ఊరేగుతూ తిరుమాడవీధులలో భక్తులకు దర్శనమిస్తున్నారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం… శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనంపై దర్శిస్తే కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ రాత్రికి స్వామివారు హనుమంత వాహనంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు లక్షలాదిగా తిరుమలకు తరలిస్తున్నారు. మలయప్పస్వామిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకుంటున్నారు. బ‌్రహ్మోత్సవాల సందర్భంగా సప్తగిరులు గోవిందనామస్మరణతో మార్మోగుతున్నాయి. తిరుమల అంతటా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. అక్టోబర్ 8 వరకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు కన్నులపండుగగా జరుగనున్నాయి.