కరెంట్ బల్బు కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ మాటలను ఉటంకిస్తూ ట్వీట్ చేసిన పవన్ వరుసగా మరిన్ని ట్వీట్లతో ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రభుత్వ తీరుతోనే ప్రజలను చీకట్లో మగ్గేలా చేసిందని, వర్షాల కారణంగా విద్యుత్ డిమాండ్ తగ్గినా ప్రజలకు కోతలు తప్పడం లేదంటూ ట్వీట్ చేసారు. ఈఏడాది వర్షాలు తగినంత కురవడంతో విద్యుత్ డిమాండ్ తగ్గుతుందని, సెప్టెంబర్‌లో 150 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటుందని విద్యుత్ నిపుణులు ముందుగా అంచనావేసినా ఆమేరకు ఏర్పాట్లు చేసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని పవన్ ఆరోపించారు. రాష్ట్రంలో సగటున రోజుకు 55మిలియన్ యూనిట్ల ఉత్పత్తి అవుతోందన్నారు. రాష్ట్రంలో అన్ని చోట్లా చీకట్లేనని ఇది ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న దసరా కానుకగా భావించాలా? అంటూ ప్రశ్నించారు.
గతేడాది కంటే ఇప్పుడు డిమాండ్ తగ్గినా ప్రభుత్వం విఫలమైందన్నారు. ”2019 సెప్టెంబర్ నెలలో విద్యుత్ డిమాండ్ 150 మిలియన్ యూనిట్స్. ఈ నెల 29 వ తేదీన థర్మల్, హైడల్, సంప్రదాయేతర ఇంధన ప్రాజెక్టులు నుంచి వచ్చిన విద్యుత్ 55 .315 మిలియన్ యూనిట్లు మాత్రమేనన్నారు. ఏపీ జెన్‌కో థర్మల్ ఉత్పత్తి సామర్థ్యం గతం కంటే మెరుగైందని చెబుతున్నారే విద్యుత్ మాత్రం ఇవ్వలేకపోతున్నారన్నారు. ‘ఏ కొత్త ప్రభుత్వమైనా రాగానే మొదటి పని శుభంతో ప్రారంభిస్తారు. కొత్త ప్రాజెక్టులు శంకుస్థాపనలు, పెట్టుబడులకు ఒప్పందాలు చేస్తారు. కానీ వైసీపీ రాగానే ఇళ్లు కూల్చివేతలు, పెట్టుబడులఒప్పందాల రద్దు, భవననిర్మాణ కార్మికులకి పనిలేకుండా చేయడం, ఆశా వర్కర్లను రోడ్ల మీదకు తీసుకురావటం, రాజధాని లేకుండా చెయ్యటం.
ఇలాంటి ఆలోచనలతో ఉన్నవాళ్ళకి కరెంటు కొరత మీద ఏం దృష్టి ఉంటుందంటూ ట్వీట్లు చేశారు. ”రావాలి జగన్ రావాలి జగన్ అన్నారు.. ఇప్పుడు రావాలి కరెంట్ కావాలి కరెంట్ అంటున్నారంటూ జనసైనికులు విమర్శిస్తున్నారు. అయితే ప్రభుత్వం కూడా రాష్ట్రంలో విద్యుత్ వినియోగానికి, లభ్యతకు మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడిందని, థర్మల్ విద్యుత్కేంద్రాలకు అవసరమైన బొగ్గు సరఫరా లేకపోవడం.. బొగ్గు కార్మికుల సమ్మె, అధిక వర్షాల కారణంగా ఒడిశా నుంచి బొగ్గు సరఫరా తగ్గడం కారణాలయ్యాయని అందులో పేర్కొంది. మరో రెండుమూడురోజులు ఇలాంటి పరిస్థితి ఉంటుందని త్వరలోనే అధిగమిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.