ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించకపోవడం ఎంతో అభినందనీయమని సినీహీరో, ప్రజా ఉద్యమకారుడు, పీపుల్స్ స్టార్ ఆర్. నారాయాణ మూర్తి అన్నారు. మార్కెట్లో ప్రజాస్వామ్యం.. డబ్బుకు బలవుతున్న రాజకీయం అనే అంశంపై కర్నూలులో బీసీ, ఎస్సీ, మైనార్టీలు సంఘాలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నారాయణమూర్తి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫిరాయింపుదారులు కచ్చితంగా రాజీనామాచేసి రావాలని జగన్ చెప్పడం చాలా గొప్ప విషయమని, ఆయన్ని అభినందిస్తున్నానన్నారు. భారత్ లో ప్రజాస్వామ్యం గాడి తప్పిందని, ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిందని పాలకుల తీరుపై ఆయన విమర్శలు చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేకప్యాకేజీ, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానినన్నారు. స్నేహ చిత్ర బ్యానర్‌పై నిర్మించిన మార్కెట్లో ప్రజాస్వామ్యం అనే సినిమా మరోసారి నవంబర్ 15 న విడుదల చేస్తున్నామని, అందరు ఆదరించాలని నారాయణమూర్తి కోరారు.
