ఏపీ మాజీ స్పీకర్ దివంగత టీడీపీ నేత కోడెల శివప్రసాద్ రావు కుమారుడు..శివరాం ఇవాళ నర్సరావుపేట కోర్టులో లొంగిపోయారు. గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని కే ట్యాక్స్‌పేరుతో అక్రమ వసూళ్లకు, గడ్డి స్కామ్ నుంచి, కేబుల్ టీవీ స్కామ్ వరకు పలు అక్రమాలకు పాల్పడ్డారంటూ…కోడెల కుమారుడు శివరాం, కూతురు విజయలక్ష్మీలపై నరసరావుపేట, సత్తెనపల్లిలో 15కు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల్లో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని శివరాం గతంలో హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసుల విషయంలో స్థానిక కోర్టులకే వెళ్లాలని, అక్కడ బెయిల్ దాఖలు చేయాలని హైకోర్ట్ సూచించింది. ఈలోగా తండ్రి కోడెల ఆత్మహత్యపై శివరాంపై మరో కేసు నమోదు అయింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్ పోలీసులకు తమ తండ్రి దశదిన కర్మలు అయిన తర్వాత విచారణకు హాజరు అవుతామని శివరాం కోరారు. తాజాగా కోడెల శివరాం నరసరావుపేట కోర్టులో లొంగిపోయారు. ఆయనపై నమోదు అయిన ఆరు కేసుల్లో బెయిల్ లభించింది. కాగా తండ్రి ఆత్మహత్య కేసులో హైదరాబాద్ పోలీసుల ముందు కోడెల శివరాం హాజరు కావల్సి ఉంది. ఇక కోడెల శివరాంకు 6 కేసుల్లో బెయిల్ లభించినా..పూర్తి స్థాయి విచారణ మాత్రం కొనసాగనుంది. ఈ ఆరు కేసులతో పాటు..మొత్తం 15 కేసులపై విచారణ జరగనున్న నేపథ్యంలో శివరాం అరెస్ట్ తప్పదన్న వార్తలు వస్తున్నాయి. మొత్తంగా కోడెల కుమారుడు శివరాం, కూతురు విజయలక్ష్మీలు కేసుల్లో పూర్తిగా కూరుకుపోయినట్లే చెప్పాలి.
