తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 30 న అంగరంగవైభవంగా ప్రారంభమయ్యాయి. పత్రి ఏటా బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన తొలి రోజు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరపున స్వయంగా ముఖ్యమంత్రి స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ మేరకు సోమవారం సా.6.32గంటలకు తిరుమల పద్మావతి అతిథి గృహానికి చేరుకున్న ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, తదితరులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. అనంతరం బేడి ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్న వైఎస్ జగన్‌కు ఆలయ అర్చకులు స్వామివారి వస్త్రాన్ని తలపాగా కట్టారు. తదనంతరం సీఎం జగన్ తన వెంట తీసుకొచ్చిన పట్టువస్త్రాలను తలపై పెట్టుకుని రాత్రి 7.11గంటలకు మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు 7.21 గంటలకు చేరుకున్నారు. తొలుత ధ్వజస్తంభానికి మొక్కుకున్న అనంతరం స్వామి వారి సన్నిధికి చేరుకుని ఆలయ అర్చకులకు పట్టువస్త్రాలను అందించి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలోని వకుళామాత, ఆనంద నిలయంపై ఉన్న విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకారుల సన్నిధి, యోగనరసింహ స్వామివార్లను దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ముఖ్యమంత్రికి శ్రీవారి తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని బహూకరించి ఆశీర్వచనాలు పలికారు. అక్కడే బియ్యంతో తులాభారం మొక్కు సమర్పించారు. ఆ తర్వాత వాహన మండపానికి చేరుకుని పెద్దశేష వాహనంపై కొలువుదీరిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. . బ్రహ్మోత్సవాలకు తొలి రోజే భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. పెద్దశేషవాహనంపై కొలువుదీరిన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి తిరుమల మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశాడు. కాగా బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించే అరుదైన గౌరవం వైఎస్ కుటుంబానికే దక్కింది. ఇంతకు ముందెప్పుడూ సీఎం హోదాలో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు పట్టువస్త్రాలను సమర్పించిన దాఖలాల్లేవు. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఐదు సార్లు సమర్పించారు. ఇప్పుడు వైఎస్ జగన్ పట్టు వస్త్రాలను సమర్పించారు. సీఎం జగన్ రాక సందర్భంగా తిరుమలలో పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 8 వరకు ఘనంగా జరుగనున్నాయి. ఈ మేరకు టీటీడీ అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు.