ఏపీలో జగన్ సర్కార్ ఒకేసారి లక్షన్నర గ్రామవాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 30 న సీఎం జగన్ స్వయంగా పోటీపరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఇక అక్టోబర్ న గాంధీ జయంతి సందర్భంగా ఏపీలో నూతనంగా గ్రామ, పట్టణ సచివాలయ వ్యవస్థను సీఎం జగన్ ప్రారంభిస్తారు. తాజాగా పట్టణ, గ్రామ సచివాలయ ఉద్యోగుల విధివిధానాలను, ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న గ్రామ, పట్ణణ సచివాలయ ఉద్యోగులు రెండేళ్లపాటు ప్రొబేషన్ పీరియడ్లో కొనసాగాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే గ్రామ, పట్టణ సచివాలయాల్లో పని చేసే మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. గర్భిణీ అయిన మహిళా ఉద్యోగికి ఆరు నెలలు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు అమలవుతాయని ప్రకటించింది. ప్రస్తుతం సచివాలయ ఉద్యోగాలకు అర్హత సాధించి నియామక పత్రాలు అందుకున్న మహిళా ఉద్యోగినుల్లో ఎవరైనా గర్భిణీలు ఉంటే..వారు విధుల్లో చేరిన వెంటనే ఆరు నెలలు మెటర్నిటీ లీవ్స్ తీసకునే అవకాశాన్ని జగన్ సర్కార్ కల్పించింది. విధుల్లో చేరిన మరుక్షణం నుంచే గర్భిణీలుగా ఉన్న మహిళా ఉద్యోగులు వేతనంతో కూడిన సెలవులను తీసుకోవచ్చు. సీఎం జగన్ ఇచ్చిన ఈ అవకాశం పట్ల గ్రామ, పట్టణ సచివాలయ మహిళా ఉద్యోగినులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
