కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేసిన అనంతరం ప్రధాని మోదీని హతమారుస్తామని పలు టెర్రరిస్టు గ్రూపులు హెచ్చరికలు జారీ చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రధానికి మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే తాజాగా రాజీవ్‌గాంధీని హతమార్చిన తరహాలోనే ప్రధాని మోదీని హతమార్చేందుకు కుట్ర జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు చెన్నై పోలీసు కంట్రోల్ రూంకు ఆదివారం ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ కాల్ చేశాడు. అందులో రాజీవ్‌గాంధీని హత్య చేసిన విధంగా మోదీని హతమార్చనున్నట్లు ఇద్దరు మాట్లాడుకుంటున్నారని తెలిపి ఫోన్ కట్ చేశాడు. దీంతో పోలీసులు వచ్చిన నంబరు ఆధారంగా విచారణ జరిపారు. చెన్నై తిరువాన్మియూర్ నుంచి ఆ వ్యక్తి కాల్ చేసినట్లు కనుగొన్నారు. ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి తిరునావుక్కరసును అరెస్టు చేశారు. ప్రధాని మోదీని రాజీవ్ తరహాలోనే చంపేందుకు నిజంగానే కుట్ర చేశారా..లేదా ఆకతాయితనంగా పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశారా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా సెప్టెంబర్ 30 న ప్రధాని మోదీ చెన్నైలో పర్యటించారు. ఈ సందర్భంగా రాజీవ్‌గాంధీని హతమార్చిన తరహాలో మానవబాంబుతో మోదీని అంతం చేసేందుకు కుట్ర జరిగిందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మురం చేశారు. ఇదిలా ఉంటే భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని కూడా చెన్నైకు సమీపంలోని పెరంబుదూరులో మానవబాంబుతో ఎల్‌టీటీఈ తీవ్రవాదులు హత్య చేసిన సంగతి తెలిసిందే. మొత్తంగా చెన్నైలో ప్రధాని మోదీ హత్యకు కుట్ర జరిగిందనన్న వార్తలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.
