తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం అవుతున్నాయి. ఈ రోజు ధ్వజారోహణతో మొదలై…8 వ తేదీ చక్రస్నానం, ధ్వజావరోహణతో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ 9 రోజుల పాటు శ్రీవారు ఉత్సవమూర్తిగా తిరుమల మాడవీధుల్లో రోజుకో వాహనంపై ఊరేగుతూ భక్తులను కరుణిస్తాడు. ఈ ఊరేగింపులో తిరుమల శ్రీ వేంకటేశ్వరుడికి బదులుగా మలయప్పస్వామి ఉత్సవమూర్తిగా రోజుకో అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తాడు. అదేంటి ఉత్సవమూర్తిగా ఊరేగేది తిరుమల శ్రీవేంకటేశ్వరుడు కాదా…ఈ మలయప్పస్వామి ఎవరు అని సందేహపడుతున్నారా..అయితే ఈ స్టోరీ చదవండి…తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్నగర్భగుడినే ఆనంద నిలయం అంటారు. ఈ ఆలయంలో గర్భగుడిలోని స్వా మివారి మూలవిరాట్టును ధ్రువ భేర అంటారు. ఈ ధ్రువ భేర అంటే కదలకుండా ఒకే చోట ఉండే ప్రతిమ అని అర్థం. ఇది ఒక్క ఏడుకొండలవాడికే కాదు..అన్ని ప్రధాన దైవాలకు వర్తిస్తుంది . అయితే ధ్రువ భేర అనబడే మూలవిరాట్టును కదిలించకూడదని ఆగమశాస్త్రం చెబుతోంది. అయితే బ్రహ్మోత్సవాలు, కల్యాణోత్సవాల సమయంలో శ్రీనివాసుడిని కొలుస్తారు…గర్భగుడి వెలుపల జరిగే ఉత్సవాలు, సేవలు, కల్యాణోత్సవాలలో ఊరేగించేందుకు స్వామివారికి ఒక ప్రతి ఉంటుంది..దీనినే ఉత్సవ భేర అంటారు. తిరుమలలో బ్రహ్మోత్సవాలలో ఈ ఉత్సవ భేరనే ఊరేగిస్తారు. ఈ ఉత్సవ భేరను మలయప్పస్వామిగా కొలుస్తారు. శ్రీవారి గర్భగుడిలోని మూలవిరాట్టుకు జరిగే ప్రతి కార్యక్రమానికి ఈ ఉత్సవభేర ప్రతినిధి గా వ్యవహరిస్తాడు. శ్రీవేంకటేశ్వరుడితో సమానంగా ఈ మలయప్పస్వామికి పూజలు జరుపుతారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో మలయప్ప స్వామిని ఉత్సవభేరగా ఉండటం వెనుక పెద్ద కథ ఉంది.
పూర్వం రాజుల కాలంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఉగ్రశ్రీనివాసుడి మూర్తిని అంటే ప్రతిమను ఉత్సవమూర్తిగా వినియోగించేవారు. అయితే దాదాపు 700 ఏళ్ల క్రితం జరిగిన బ్రహ్మోత్సవాల్లో స్వామి ఊరేగింపు సందర్భంగా చుట్టు పక్కల మంటలు చెలరేగడంతో భక్తులు, అర్చకులు భయభ్రాంతులకు గురయ్యారు. అప్పుడు స్వామివారు ఒక భక్తుని ద్వారా తన సందేశాన్ని వినిపించారు.. మారుతున్న పరిస్థితులు, కాలానికి అనుగుణంగా ఉగ్ర శ్రీనివాసమూర్తి ప్రతిమకు బదులుగా మరో సౌమ్యమైన ప్రతిమను ఉత్సవ మూర్తిని వినియోగించాలని స్వామివారి ఓ భక్తుడి ద్వారా సందేశం ఇచ్చారు. అంతేకాదు.. ఒక కొండ వంగి ఉండే ప్రదేశంలో సౌమ్యమైన తన మూర్తి కనిపిస్తుందని కూడా తన సందేశంలో స్వామివారు వినిపించారు. దీంతో ఆ సందేశాన్ని అనుసరించి భక్తులతో పాటు అర్చకులు స్వామివారు చెప్పిన ఆ కొత్త ఉత్సవ మూర్తి కోసం వెతకసాగారు. అలా వెతుకున్న వారికి ఒకచోట శ్రీదేవి, భూదేవి సహిత వేంకటేశ్వరుడి విగ్రహాలు లభించాయి. ఈ స్వామివారికి తమిళంలో మలై కునియ నిన్ర పెరుమాళ్ అంటే తలవంచిన పర్వతం మీద కొలువైన స్వామి అన్న పేరుతో పిలవడం మొదలు పెట్టారు. ఆ పేరు కాస్త కాలక్రమంలో మలయప్ప స్వామిగా మారింది. ఈ మలయప్ప స్వామి విగ్రమం పంచలోహాలతో రూపొందించబండి. . తామరపువ్వు ఆకారంలోని పీఠం మీద మూడు అడుగుల ఎతున ఠీవిగా ఉన్న శ్రీనివాసుని ప్రతి రూపమే.. మలయప్ప స్వామి. శంఖు చక్రాలతో, వరద హస్తంతో స్వామి వారి దివ్యమంగళ రూపం మనకు కనబడుతుంది. విగ్రహానికి కుడివైపున శ్రీదేవి, ఎడమవైపు భూదేవి అమ్మవార్ల విగ్రహాలు ఉంటాయి. ఆ విగ్రహాల భంగిమలు కూడా ఒకే రకంగా ఉంటాయి. ఈ విగ్రహాలు దొరికిన కోనని ఇప్పటికీ మలయప్ప కోనగా పిలుస్తారు. ఈ మలయప్ప కోనను తిరుమలకు వెళ్లిన భక్తుల్లో కొంతమంది సందర్శిస్తూ ఉంటారు. దాదాపు 700 సంవత్సరాలకు పూర్వమే లిఖించిన ఒక శాసనంలో ఈ మలయప్ప విగ్రహాల ప్రసక్తి ఉందని చెబుతారు. ఈ శాసనం ఇప్పటికీ చాలా భద్రంగా కాపాడుతూ ఉన్నారు. ఇక శ్రీవారికి భక్తులు జరుపే కళ్యాణోత్సవాల్లో, సాయంకాలం సమయంలో జరిగే సహస్రదీపాలంకరణ సేవలో కూడా మలయప్ప స్వామివారే కొలువై ఉంటారు. అలాగే స్వామివారికి జరిగే కొన్ని అభిషేకాల్లో కూడా ఉత్సవమూర్తికి భాగం ఉంటుంది. పుష్కరిణిలో జరిగే తెప్పోత్సవం కూడా మలయప్ప స్వామివారికే నిర్వహిస్తారు. ఇక ప్రఖ్యాతిగాంచిన తిరుమల బ్రహ్మోత్సవాలలో ఉత్సవమూర్తిగా మలయప్పస్వామి రోజుకో ఒక్క వాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శనం ఇస్తాడు. మాడవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగే ఈ మలయప్పస్వామిని చూడటానికి రెండు కళ్లు సరిపోవు. ఇదీ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఊరేగే మలయప్పస్వామి కథ. శ్రీవేంకటేశ్వరుడు మూలవిరాట్టుగా ప్రతినిత్యం గర్భగుడిలో పూజలందుకుంటే..ఆయన ప్రతిమగా ఉత్సవ భేరగా ఆలయం వెలుపల మలయప్పస్వామి భక్తులచే పూజలందుకుంటున్నాడు.