మాతృభాష పరిరక్షణ కు నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.ఇంగ్లీష్ మోజులో తెలుగు భాష ప్రాధాన్యత తగ్గుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ఆదివారం మధ్యాహ్నం సూర్యపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని గొట్టిపర్తి గ్రామం లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నూరేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ దీపికా యూగందర్ రావు ,స్థానిక శాసనసభ్యుడు గాధారి కిశోర్ కుమార్ లతో కలసి ఆయన పాల్గొన్నారు .
ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు భాషను అమ్మ మనసుతో పోల్చారు.అంతటి పవిత్రమైన భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పై ఉందన్న విషయాన్ని విస్మరించరాదని ఆయన కోరారు.ఇంగ్లీష్ బాషా అన్నది అవసరం కోసమే నన్న విషయాన్ని గుర్తెరగాలని మంత్రి సూచించారు.
తెలుగును నేర్చుకోవడం తో పాటు నేర్పాల్సిన బాధ్యత నేటి సమాజానికి ఉందన్నారు.నూరు వసంతాలు పూర్తి చేసుకున్న గొట్టిపర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చరిత్రలో సుస్థిర స్థానం ఉంటుందని ఆయన చెప్పారు.అటువంటి పాఠశాలలో విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు జరుపుకుంటున్న సమ్మేళనానికి హాజరుకావడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు.
అటువంటి చరిత్ర కలిగిన ఈ పాఠశాల పూర్వవైభవం తగ్గకుండా చర్యలు తీసుకుంటానన్నారు.ఇప్పటికే పాఠశాల స్థితి గతులపై స్థానిక శాసనసభ్యుడు గాధారి కిశోర్ కుమార్ తన దృష్టికి తీసుకు రాగ అప్పటికప్పుడే మూడు తరగతి భవనాలను మంజూరు చేసిన అంశాన్ని మంత్రి జగదీష్ రెడ్డి గుర్తు చేశారు.అయితే హుజుర్నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు రావడంతో కోడ్ దరిమిలా శంకుస్థాపన పనులు వెనక్కు జరిగాయన్నారు.అంతే గాకుండా వందేండ్లు పూర్తి చేసుకొని వేలాది మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించిన ఈ పాఠశాలలో తన వంతు బాధ్యతగా గ్రంధాలయం ఏర్పాటు చేస్తామన్నారు.అనంతరం అదే పాఠశాలలో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు మంత్రి జగదీష్ రెడ్డి చేతుల మీదుగా సన్మానం నిర్వహించారు.
Tags guntakandla jagadeesh reddy kcr ktr slider telangana minister telanganacm telanganacmo trs trswp