ఐఎన్ఎక్స్ కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరానికి ఢిల్లీ హైకోర్ట్‌లో చుక్కెదురైంది. ఐఎన్‌ఎక్స్ మీడియా స్కామ్‌లో చిదంబారాన్ని సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న చిదంబరం బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఈ కేసులో చిదంబరం దాఖలు చేసిన బెయిల్‌ను ఢిల్లీ హైకోర్ట్ కొట్టివేసింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చిదంబరం బయటకు వెళితే సాక్షులను ప్రభావితం చేస్తారన్న సీబీఐ న్యాయవాది వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. ఈ కేసు తీవ్రతను పరిశీలించిన పిమ్మట చిదంబారానికి బెయిల్ ఇవ్వకూడదన్న సీబీఐ వాదనను కొట్టిపారేయలేమని హైకోర్ట్ బెంచ్ అభిప్రాయపడింది.కాగా ఐఎన్‌ఎక్స్ మీడియా కేసుకు సంబంధించి కీలక ఆధారాలు మాయం అయ్యాయని అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఇదివరకే ఢిల్లీ హైకోర్ట్‌కు తెలిపారు. ఈ కేసులో అరెస్టైన చిదంబరం ఆధారాలన్నింటిని మాయం చేశారని మెహతా కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇవాళ చిదంబరం దాఖలు చేసిన బెయిల్ పిటీషన్‌ను ఢిల్లీ హైకోర్ట్ తిరస్కరించింది. దీంతో చిదంబరం మళ్లీ తీహార్ జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది.
