విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు తెలంగాణ ధర్మ ప్రచార యాత్రను ప్రారంభించారు. ఈ ధర్మ ప్రచార యాత్రలో భాగంగా సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 8 వరకు స్వామి వారు ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలో పర్యటిస్తారు. పర్యటన నిమిత్తం నిన్న వరంగల్‌కు చేరుకున్న స్వామివారికి భక్తులు ఘనస్వాగతం పలికారు. ఇవాళ ఉదయం రాజ్యసభ ఎంపీ కెప్టెన్ లక్ష్మీ కాంతరావు గారి నివాసంలో శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు భక్తులకు దర్శనం ఇచ్చారు. నేటి నుంచి దే వి నవరాత్రులు ప్రారంభం అవుతున్న సందర్భంగా కెప్టెన్ లక్ష్మీ కాంతరావు గారి ఇంట్లో దేవి పీఠ పూజా కార్యక్రమాన్ని నిర్వహించిన స్వామివారు తదనంతరం వేయిస్థంభాల గుడిని సందర్శించారు. స్వయంగా మహా శివుడికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే గుడిలో దేవి నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన అమ్మవారికి కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహభాషణం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్, దరువు ఎండీ సిహెచ్ కరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా స్వామివారి ఆగమనం సందర్భంగా వేయి స్తంభాల గుడికి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు.
