ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు వరుసగా ఆరోసారి కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ..ఆయన ఎన్నిక రద్దు చేయాలంటూ వైసీపీ అభ్యర్థి కృష్ణ చంద్రమౌళి తరఫున ఎన్నికల ఏజెంట్‌గా పనిచేసిన అన్నాస్వామి సుబ్రహమ్మణ్యం విద్యాసాగర్ హైకోర్ట్‌లో పిటీషన్ దాఖలు చేసారు. ఈ మేరకు హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ చంద్రబాబుతో పాటు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి కూడా నోటీసులు ఇచ్చారు. ఇక చంద్రబాబు ఎన్నికల సమయంలో ఏ విధంగా నిబంధనలు ఉల్లఘంచారు…ఆయన ఎన్నిక ఎందుకు రద్దు చేయాలనే అంశంపై పిటీషనర్ అనేక అంశాలను కోర్ట్‌కు వివరించారు. సుప్రీం కోర్ట్ మార్గదర్శకాల ప్రకారం.. పబ్లిక్ సర్వెంట్‌గా అంటే ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేల స్థాయిలో పని చేసే వ్యక్తి ఎన్నికలలో పోటీ చేసే సమయంలో ప్రభుత్వం నుంచి జీతభత్యాలు తీసుకున్న వివరాలను, అలాగే వృత్తి రీత్యా వచ్చే ఆదాయాలను కూడా ఎన్నికల అఫిడవిట్‌లో చూపాలి. తన ఆదాయంతోపాటు కుటుంబసభ్యుల ఆదాయాన్ని కూడా అఫిడవిట్లలో పేర్కొనాలి. అయితే ఈ నిబంధనలను చంద్రబాబు ఉల్లంఘించారని కోర్టుకు నివేదించారు. సీఎంగా చంద్రబాబు తీసుకున్న జీతభత్యాలను సామాజిక సేవ ద్వారా వచ్చిన రాబడిగా పేర్కొని, ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొనకపోవడం చట్ట ఉల్లంఘన అవుతుందన్నారు. వీటిని పరిగణలోకి తీసుకొని చంద్రబాబు నాయుడి ఎన్నికను రద్దు చేయాలని పిటీషనర్ కోరారు. ఈ పిటీషన్‌పై విచారణ జరిపిన హైకోర్ట్ ఈ మేరకు చంద్రబాబుకు, ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమాధానం చెప్పాలని నోటీసులు జారీ చేస్తూ..ఈ కేసును నాలుగు వారాలకు వాయిదా వేసింది. మొత్తంగా కుప్పంలో చంద్రబాబు పేర్కొన్న ఎన్నికల అఫిడవిట్‌లో నిబంధనలు ఉల్లంఘించారని పిటీషనర్ ఆరోపిస్తున్నారు. ఒక వేళ కుప్పంలో చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘించాడని హైకోర్ట్ నిర్ధారిస్తే..ఆయన ఎన్నిక రద్దై వైసీపీ అభ్యర్థి గెలుపొందినట్లుగా ప్రకటిస్తారు. దీంతో టీడీపీలో టెన్షన్ మొదలైంది. మరి చంద్రబాబు ఎన్నిక రద్దు అవుతుందా లేదా అన్నది తెలియాలంటే నాలుగు వారాలు ఆగాల్సిందే.
