మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మాదిరిగానే మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను కూడా అంతమొందించేందుకు జగన్ ప్రభుత్వం తీవ్రం కుట్రలు చేస్తోందని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు. ఏలూరు సబ్ జైల్లో చింతమనేని ప్రభాకర్ ని పరామర్శించిన అనంతరం తెలుగుదేశం లీడర్లు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎల్లకాలం వైసీపీ ప్రభుత్వమే ఉండదని, తాము అధికారంలోకి వచ్చినప్పుడు అంతకంతకు బదులు కక్ష తీర్చుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రతిపక్షాన్ని అణగదొక్కేవిధంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు..
కావాలనే చింతమనేనిపై అక్రమకేసులు బనాయించి వేధిస్తున్నారంటూ పెద్దాపురం టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్ప మండిపడ్డారు. తాను హోంమంత్రిగా ఉన్నప్పుడు ఎంతో న్యాయబద్ధంగా వ్యవహరించానని, ఇలా ఎప్పుడూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదన్నారు. కోడెల శివప్రసాద్ మాదిరిగానే, చింతమనేని ప్రభాకర్‌ను కూడా అంతమొందించేందుకు ప్రభుత్వం కేసులతో వేధింపులకు గురిచేస్తోందన్నారు. దీనిపై మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తామన్నారు. అలాగే పశ్చిమగోదావరి ఎస్పీ నవదీప్‌సింగ్‌ను కలిసిన టీడీపీ నేతలు చింతమనేనిపై పెట్టిన కేసులపై మెమొరాండం సమర్పించారు. ఇరుపక్షాలను విచారణ చేసిన తర్వాతే కేసులు నమోదు చేయాలని కోరారు. ఇదేవిధంగా టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.