తక్కువ ధరకే మద్యం ఇచ్చేందుకు వైన్ షాపుల యజమానులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈనెలతో పాత మద్యవిధానం ముగుస్తుండడంతో షాపుల్లోని మద్యాన్ని క్లియర్ చేసుకునేందుకు యజమానులు మద్యం ధరల్లో ఆఫర్లు ఇస్తున్నారు. మద్యం కొనుగోలు చేస్తే స్నాక్స్ ఉచితంగా ఇచ్చేందుకు ప్రణాళికలు చేస్తున్నారు.. టీడీపీ హయాంలో ఏర్పాటుచేసిన మద్యంషాపుల కాలపరిమితి జూన్ నెలాఖరుకు ముగుస్తుంది. అయితే అప్పటికేనూతన ప్రభుత్వం షాపుల గడువును మూడు నెలలు పొడిగించింది. అంతేకాకుండా మద్యంషాపుల్లో తప్పకుండా ఎమ్మార్పీకే విక్రయించాలని, బెల్ట్‌షాపుల్ని పూర్తిగా నిర్మూలించాలని ఎక్సైజ్‌శాఖ ఆదేశించింది.
దీంతో మూడునెలలుగా మద్యంషాపుల్లో ఎమ్మార్పీ విక్రయాలు చేస్తున్నారు. దాంతో గతంలో ఉన్న షాపుల సంఖ్యను20శాతానికి తగ్గించింది. నూతనంగా ఏర్పాటయ్యే మద్యం షాపుల్లో విక్రయాల సమయాన్ని ఉదయం 10 నుంచి రాత్రి 9 వరకు నిర్ణయించారు. మద్యం షాపుల వద్ద ధరల పట్టిక తప్పనిసరిగా ప్రదర్శించాలని, 18ఏళ్లలోపు వయసు గలవారికి మద్యం విక్రయించకూడదని, గుడి, బడి, ఆసుపత్రులకు 100 మీటర్ల దూరంలోను జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల దూరంగా షాపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మరోవైపు గత రెండేళ్లుగా మద్యంషాపులు నిర్వహిస్తున్నవారికి ఈ నెలాఖరులోపు గడువు ముగుస్తుండడంతో షాపుల్లోని సరుకు ఖాళీ చేసేందుకు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. షాపుల్లో మిగిలిపోయిన మద్యం ప్రభుత్వానికి తిరిగి అప్పగించి సొమ్ములు చేసుకునే అవకాశం ఉన్నా ఎక్కువమంది స్థానికంగానే సరుకు వదిలించుకునేందుకు మక్కువ చూపుతున్నారు. దీంతో మద్యం ధరలను ఎంఆర్‌పీ కంటే తగ్గిస్తూనే మద్యం షాపుల వద్ద తాగేవారికి కోడిగుడ్లు, కోడి పకోడి, అరటిపళ్లు వంటి స్నాక్స్‌ను ఉచితంగా ఇస్తున్నారు. మొత్తమ్మీద మద్యం పాలసీ మారడంతో మద్యం ప్రియులకు తక్కువ ధరకే లభించడంతో పాటు ఉచితాలు కూడా దక్కనున్నాయి.