మాజీ మంత్రి, డీసీసీబీ మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ నాయకుడు, ప్రజల మనిషిగా పేరుగాంచిన బలిరెడ్డి సత్యారావు (83)ఇక లేరు. నిన్న సాయంత్రం వాకింగ్ చేస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బలిరెడ్డి స్థానిక మైక్యూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కాగా ఇవాళ ఉదయం మహారాణి పేటలో బలిరెడ్డి నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి, అంజలి ఘటించి, కుటుంబసభ్యులను పరామార్శించారు. ఈ సందర్భంగా బలివాడ మరణం చోడవరం నియోజకవర్గానికి తీరని లోటు అని సీఎం జగన్ అభివర్ణించారు. ఇక ఈ ప్రమాదానికి కారణమైన వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేసినట్టు ఎంఆర్‌పేట ఎస్‌ఐ రమేష్ తెలిపారు. వాకింగ్ నిమిత్తం బీచ్‌వైపు వెళ్తున్న సత్యారావును శ్రీకాకుళం జిల్లా రణస్థలం ప్రాంతానికి చెందిన ఉప్పాడ రాము బైక్‌తో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సత్యారావు మృతి చెందారు. బలివాడ సత్యారావుకు పెద్దమనిషిగా, నీతికి, నిజాయితీకి మారుపేరుగా, మచ్చలేని నాయకుడిగా నియోజకవర్గంలో మంచి పేరుంది. ఇక నోరారా మామయ్యగారు అని పిలుచుకునే తన రాజకీయ గురువు బలివాడ సత్యారావు మరణవార్త విని ప్రస్తుత చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కన్నీటీ పర్యంతం అయ్యారు. బలివాడ మరణంతో చోడవరంతో నియోజకవర్గంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఆయన్ని కడసారి చూసేందుకు వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
